సిద్ధరాముడికి పట్టాభిషేకం

అట్టహాసంగా ప్రమాణం
రూపాయికే కిలో బియ్యం
కర్ణాటక ప్రజలపై వరాల జల్లు
బెంగళూరు, మే 13
(జనంసాక్షి) :
సిద్ధరాముడి పట్టాభిషేకం అట్టహా సంగా జరిగింది. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ భరద్వాజ్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటక రాష్ట్రానికి సిద్ధ రామయ్య 22వ ముఖ్యమంత్రి. నగరంలోని కంఠీరవ స్టేడియంలో సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి వీరప్పమొయిలీ, కాంగ్రెస్‌ ఎంపి హనుమంతరావు, మహారాష్ట్ర సీఎం పృధ్విరాజ్‌ చౌహాన్‌, తదితరులు హాజరయ్యారు. సోమవారం ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల జాబితాతో ఢిల్లీకి వెళ్లి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాను, ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి ఆమోదముద్ర వేయించుకోనున్నట్టు తెలిసింది. 34మందితో జాబితా రూపొందించినట్టు తెలిసింది.  ఈనెల 5న జరిగిన కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్‌  పార్టీ 121 సీట్లతో సంపూర్ణ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. విధాన సభలోని 224 స్థానాలకుగాను 223 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 8 ఓట్ల లెక్కింపు నిర్వహించారు. గత శుక్రవారం అధిష్టానం పరిశీలకుడిగా వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి ఆంటోని ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు, అధిష్టానం ఆదేశంతో సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించిన విషయం విదితమే.