సిద్ధిరామయ్యేకే కన్నడ పీఠం

బెంగళూర్‌, మే 10 (జనంసాక్షి) :
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేశారు. శుక్రవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో సిద్ధిరామయ్యకు 103 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. 120 మందిలో అత్యధిక మంది ఎమ్మెల్యేలు సిద్ధిరామయ్యేకే అనుకూలంగా ఉండటంతో ఆయనకే సీఎం పదవి కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించింది. ఏఐసీసీ పరీశీలకుడు, కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోని నేతృత్వంలో అభిప్రాయసేకరణ జరిపారు. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సోనియాగాంధీకి ఫోన్‌లో వివరించారు. ఆమె సూచన మేరకు సిద్ధిరామయ్య పేరును ఆంటోని ప్రకటించారు. ఉదయం నుంచి బెంగళూర్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిద్ధిరామయ్య నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సీఎం రేసులో సిద్ధిరామయ్య, మల్లికార్జున ఖర్గేతో పాటు కేంద్ర మంత్రులు ఎస్‌ఎం కృష్ణ, వీరప్పమొయిలీ ఉన్నట్లు ప్రచారం సాగింది. ఇందులో ఎస్‌ఎంకృష్ణ, వీరప్పమొయిలీలు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారే కావడంతో తమకు మరోసారి అవకాశం కల్పిస్తే పార్టీని రాష్ట్రంలో పటిష్ట పరుస్తామని చెప్పుకున్నారు. చివరికి మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు సీఎల్పీ మాజీ నేత సిద్ధిరామయ్యేకే పట్టం కట్టబెట్టారు. ఆయన సోమవారం ఉదయం 11.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎంతో పాటు 15 మంది కేబినెట్‌ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇద్దరు డెప్యూటీ సీఎంలను నియమించాలని అధిష్టానం సిద్ధిరామయ్యను ఆదేశించినట్లుగా సమాచారం.