సిరిసిల్ల పట్టుచీర “రాజన్న సిరిపట్టు” బ్రాండ్ అవిష్కరణ కార్యక్రమం
న్యూజిలాండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా మాట్లాడిన కేటీఆర్
“రాజన్న సిరిపట్టు” బ్రాండ్ ను మరింత విస్తృతం చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు-కెటియార్
రాజన్న సిరిపట్టును ఆవిష్కరించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ కు కేటీఆర్ ధన్యవాదాలు
సిరిసిల్ల పట్టుచీర “రాజన్న సిరిపట్టు” అంతర్జాతీయ వేదికలపైన అనేక మందిని ఆకర్షిస్తున్నది. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారుచేసిన “రాజన్న సిరిపట్టు” పట్టుచీరలు న్యూజిలాండ్ కి చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా న్యూజిలాండ్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో అవిష్కరించబడింది. రాజన్న సిరిపట్టు చీరలను ప్రారంభించిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంకకు రాష్ట్ర టెక్స్టైల్ శాఖ మంత్రి, కే.తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన నేతన్నల ఉత్పత్తులు ప్రపంచ వేదికలపైన ఆవిష్కారం కావడం అత్యంత సంతోషాన్ని ఇస్తున్నదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేంద్ర మంత్రి ప్రియాంక రాధకృష్ణన్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఆర్ఐ మరియు బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తదితరులను మంత్రి అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు నేడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే పరిస్థితికి చేరుకున్నారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు, వినూత్న ఉత్పత్తులను తయారు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే హరిప్రసాద్ ఇలాంటి నేతన్నల నైపుణ్యం వలన సిరిసిల్ల కేంద్రంగా బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలు ఇమిడి చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేయడం జరుగుతున్నది. న్యూజిలాండ్ లో జరిగిన రాజన్న సిరి పట్టు బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు. సిరిసిల్ల రాజన్న సిరి పట్టుకు మంచి భవిష్యత్తు ఉండాలని, అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు.
నాలుగు సంవత్సరాల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు తెలంగాణ కు వచ్చిన బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ సిరిసిల్ల లోని నేతన్నలు, వారి నైపుణ్యం గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పుడే సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ గురించి తెలుసుకొని, ఆయనతో పట్టుచీరలు తయారు చేయించి, అమెరికా, యూకే, న్యూజిలాండ్ వంటి ఆరు దేశాల్లోని తెలిసిన వారికి, సిరిసిల్ల పట్టుచీరలకు ఆర్డర్లు ఇప్పించారు. అయితే సిరిసిల్ల పట్టుచీరలకు ఒక బ్రాండ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో “రాజన్న సిరిపట్టు”గా నామకరణం చేసి, న్యూజిలాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ తో, 300 మంది ప్రవాస భారతీయుల సమక్షంలో సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను ప్రదర్శించారు. ఆ తర్వాత సిరిసిల్ల పట్టుచీరలతో ఒక ఫ్యాషన్ షోను సైతం నిర్వహించారు. “రాజన్న సిరిపట్టు” పేరుతో సిరిసిల్ల పట్టు చీరలకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్న తన ఆలోచనకు, అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రవాసీ మహిళల నుంచి మంచి స్పందన లభిస్తుందని బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ తెలిపారు. తొలుత నేతన్న హరిప్రసాద్ ఒక్కరితో మాత్రమే ప్రారంభమైన పట్టు చీరల ఉత్పత్తి, ప్రస్తుతం జిల్లాలో 40 మందికి పైగా నేత్నలకు ఉపాధి లభిస్తుందని ఆమె తెలిపారు.
నేతన్నల ఉత్పత్తులను ముఖ్యంగా “రాజన్న సిరిపట్టు” పట్టు చీరలను తన చేతుల మీదుగా ప్రారంభించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు పట్టు చీరలు ఎంతో ఇష్టమని, తెలంగాణకు చెందిన బతుకమ్మ సంబరాల కోసం ప్రవాసీలు తనని ఆహ్వానించిన ప్రతిసారి, వాటినే ధరిస్తానని.. పట్టుచీరలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో సిరిసిల్లకు చెందిన ఒక పట్టుచీరను ధరించి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్న విషయం ట్విట్టర్ ద్వారా తెలుసుకొన్న కెటియార్, ఆయనను హైదరాబాద్లో తర్వతా ఒక సమావేశంలో కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారన్నారు.