సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి రియాక్షన్
హైదరాబాద్, డిసెంబర్ 28 (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర పార్టీల యాక్షన్‌ను బట్టి తమ రియాక్షన్ ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణపై ఈనెల 28న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ టీఆర్‌ఎస్ తరపున హాజరుకావాలంటూ కోదండరాంను ఆహ్వానించిన విషయంపై చర్చించారు. పార్టీల ప్రతినిధులే అఖిలపక్షానికి వెళ్లాలని కమిటీ నిర్ణయించింది. అయితే అఖిలపక్షానికి ఇంకా సమయం ఉన్నదని, కేసీఆర్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని తాను హాజరుకావాలా వద్దా అనే అంశం జేఏసీ సమావేశంలో చర్చకు రాలేదని కోదండరాం వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జేఏసీ భవిష్యత్తు కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈనెల 23న కేంద్రం తన ప్రకటనను వెనుక్కు తీసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని విద్రోహ దినంగా పాటించాలని, ఆ రోజు నల్లజెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. 26న తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామన్నారు. 27 ఉదయం ఇందిరాపార్కు వద్ద భారీ ఎత్తున నిరసన దీక్ష ప్రారంభించి 28 ఉదయం 8 గంటల వరకు కొనసాగిస్తామన్నారు. 28న ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో జేఏసీ భాగస్వామ్య పక్షాలు, కుల సంఘాలు అన్ని పాల్గొంటాయని ఆయన వెల్లడించారు. 28న అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరిని బట్టి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ వరుస కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శాంతియుతంగా తెలంగాణ రావాలంటే ఈ అఖిపక్షమే చివరి సమావేశం కావాలని కేంద్రానికి కూడా ఇది చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాల సందర్భంగా పోలీసులు కూడా సంయమనంతో పాటించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. టీయూఎఫ్ నాయకురాలు విమలక్క విడుదలపై జేఏసీ స్పందించడంలేదంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ తాము ఆ విషయంపై చర్చించలేదనేది అవాస్తవమని ఖండించారు. తామెప్పుడో విమలక్కను విడుదల చేయాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.