సుపాలనకు సలహాలివ్వండి

ముఖ్యమంత్రుల సదస్సులో షిండే
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి):
పాలనా సంస్కరణలపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, పోలీసింగ్‌ తదితర అంశాలపై సోమ వారం జరిగిన సదస్సును హోంశాఖమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ప్రారంభించారు. పోలీసులు ఎదుర్కొం టున్న సవాళ్ళు, ప్రజా పాలనలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి 153 అంశాలతో కూడిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రులకు తాను గత సెప్టెంబర్‌లో పంపానని షిండే అన్నారు.  అయితే కేవలం 15మంది నుంచి మాత్రమే స్పందన వచ్చిందని, మిగిలిన వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. ప్రజాపాలనలో నిత్యం ఎదర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందజేయడం ద్వారా ప్రజలకు మేలైన సేవలను అందించగలమని చెప్పారు. మారుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. సమాజంలో శాంతిభద్రతలు వెల్లివిరుస్తూ ప్రజారంజక పాలన సాగేందుకు ప్రజా ప్రతినిధులుగా మెరుగైన సూచనలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో ఎన్‌సిటిసి చట్టంపై కూడా సమగ్ర   చర్చ జరగాలని షిండే అభిలషించారు. దేశంలో పెచ్చరిల్లుతున్న హింసాత్మక చర్యలను అరికట్టేందుకు సమర్థమైన ఎన్‌సిటిసి వంటి చట్టాల అవసరాన్ని గుర్తించాలని అన్నారు. ఈ విషయాలపై దృష్టి సారించి సమగ్ర సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కపిల్‌ సిబల్‌, జైరాంరమేష్‌, వీరప్పమొయిలీ, హోంశాఖ సహాయమంత్రి ఆర్‌పిఎన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ఉన్నతస్థాయిలో జరిగి ఈ సదస్సుకు  కేవలం ఏడుగురే ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈశాన్య రాష్ట్రాలు ఐదు, ఉత్తరాఖండ్‌, ఒడిశాల ముఖ్యమంత్రులు మాత్రమే ఈ సదస్సుకు హాజరయ్యారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు మమత, జయలలిత, అఖిలేశ్‌ యాదవ్‌, మోడీ, నితీష్‌ కుమార్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రామన్‌సింగ్‌ తదితరులెవరూ ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరుకాలేదు. వారితోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పృథ్వీరాజ్‌ చవాన్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, అశోక్‌ గెహ్లాట్‌, వూమెన్‌ చాందీ, భూపిందర్‌సింగ్‌, ఇబోబి సింగ్‌, వీరభద్రసింగ్‌లు కూడా సభకు డుమ్మాకొట్టడం చర్చనీయాంశమైంది. బీహార్‌ ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉండి సమావేశానికిరాలేదు. హిమాచల్‌, మణిపూర్‌, కాశ్మీర్‌ ముఖ్యమంత్రులు వస్తామని చెప్పి రాలేదు. రాష్ట్రముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతున్నారని భావించినప్పటికి ఆయన పర్యటన రద్దు అయింది. ఈ నెల 18వ తేదీన రాహుల్‌ గాంధీతో సమావేశం అవ్వాల్సి ఉన్నందున, రాష్ట్రంలో అనుచిత వాతావరణం నెలకొని ఉన్నందున ఆయన హాజరుకాలేదని తెలుస్తోంది. కాగా సాధారణంగా ముఖ్యమంత్రుల సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే ప్రధానమంత్రి కూడా ఈ సమావేశానికి హాజరుకాకపోవడం కొసమెరుపు.