సెప్టెంబర్‌లో తెలంగాణ విషప్రచారం నమ్మొద్దు : కేకే

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): సెప్టెంబర్‌లోగా తెలంగాణ వస్తుందన్న ఆశాభా వాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు కె.కేశవరావు అన్నారు. శనివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. అక్కడ మౌనదీక్ష నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావుకు సంఘీభావం తెలిపారు. అనంతరం విలేకరు లతో మాట్లాడారు. వి.హనుమంతరావు చేపట్టిన మౌనదీక్ష కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా కాదన్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలన్నదే విహెచ్‌ ఉద్దేశమన్నారు. ఇదివరకు ఒకసారి మేథోమథనం జరిగిందని, మరోసారి జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేశారు. ఎవరెన్ని నివేదికలు ఇచ్చినా అధిష్టాన నిర్ణయానికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీలో మేథోమథనం జరగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పార్టీకి ఎల్లవేళలా వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తల్లో ప్రస్తుతం నెలకొన్న అసంతృప్తిని పారదోలాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఉందన్నారు. నామినేటెడ్‌ పోస్టులలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
మేథోమథనం జరగాల్సిందేమంత్రి డిఎల్‌, సీనియర్‌ నేత కెకె డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 28 (ఎపిఇఎంఎస్‌): పార్టీలో మేథోమథనం జరిపించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు చేపట్టిన దీక్షకు మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె.కేశవరావు సంఘీభావం తెలిపారు. శనివారంనాడు గాంధీభవన్‌లో దీక్ష చేపట్టిన వి.హనుమంతరావును వీరిరువురు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో డిఎల్‌ మాట్లాడుతూ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చ చేపడితే వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. విహెచ్‌ దీక్ష న్యాయ సమ్మతమైనదేనని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ మహా సముద్రం లాంటిదని, అలాంటి పార్టీలో సమస్యలు కూడా ఎక్కువే ఉంటాయని ఆయన అన్నారు. అయితే పార్టీ సీనియర్ల అభిప్రాయాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. దీంతో పార్టీలోని కొందరు సీనియర్‌ నేతల్లో, కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాలుగా పార్టీలో నెలకొన్న పరిణామాలపై మేథోమథనం జరిగితే కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తారని ఆయన అన్నారు. ముఖ్యంగా పార్టీలో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేయకపోవడంపై కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొని ఉన్నదని అన్నారు. ముఖ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి జగన్‌కు కోవర్టులా వ్యవహరిస్తున్నారని వచ్చిన వార్తల్లో నిజం ఉన్నదని ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
కెకె మాట్లాడుతూ విహెచ్‌ డిమాండును తాను సమర్ధిస్తున్నానని తెలిపారు. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతోనే విహెచ్‌ దీక్ష చేపట్టారని, పార్టీకి వ్యతిరేకంగా కాదని ఆయన అన్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే మేథోమథనం జరిగిందని, మరోసారి నిర్వహించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబరు లోగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కేశవరావు అన్నారు. ముఖ్యంగా మంత్రుల కమిటీతో ఒరిగేదేమీ ఉండదని ఆయన తెలిపారు. పార్టీలో కొందరు సీనియర్లను ముఖ్యమంత్రి కిరణ్‌ నిర్లక్ష్యం చేయడం వల్లే కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొని ఉన్నదని ఆయన తెలిపారు. పార్టీలో మరోసారి మేథోమథనం నిర్వహిస్తే పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు కార్యకర్తలు, నాయకుల్లో కూడా విశ్వాసం నెలకొంటుందని, దీనిపై అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవాలని కేశవరావు విజ్ఞప్తి చేశారు.