సెప్టెంబర్ మార్చ్‌కు అనుమతివ్వండి
లేకుంటే.. మరో మిలియన్‌మార్చ్ అవుతది
తెలంగాణ కోసం సీఎం అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే
మార్చ్‌కు తెలంగాణ ఎంపీల మద్దతుంది
ప్రత్యక్షంగా పాల్గొనే విషయం 25న ప్రకటిస్తాం : పొన్నం
కరీంనగర్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) :
ఈ నెల 30న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి వ్వాల్సిందేనని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేకుంటే గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఎదురైన అనుభవాలే పునరావృతమయ్యే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్‌పై ధ్వజమెత్తారు. సీఎం తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలనడం తగదన్నారు. సీఎంగా వ్యవహరిం చడం బాధ్యతే అయినాతెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. మనోభావాలు దెబ్బతినకుండా సీఎం మాట్లాడాలని పొన్నం హితవు పలికారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ అంశాన్ని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశం వచ్చిన ప్రతీసారీ రెండోసారి తీర్మానం సాధ్యం కాదని సీఎం మాట్లాడటం అప్రజాస్వామికమన్నారు. వెంటనే కేంద్రానికి తెలంగాణకు అనుకూలంగా నివేదిక పంపాలని పొన్నం డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య ఉండడం వల్లనే సీఎం తన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు రెచ్చగొట్టేలా సీఎం మాట్లాడడం సరికాదన్నారు. గణేశ్ నిమజ్జమున్నా, జీవవైవిధ్య సదస్సు ఉన్నా మార్చ్ తప్పక జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్‌కు టీఎంపీల సంపూర్ణ మద్దతుందని, ప్రత్యక్షంగా పాల్గొనే విషయాన్ని 25న ప్రకటిస్తామని వివరించారు. తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు సాగితే ప్రతి దానికి టీఎంపీల మద్దతు ఉంటుందని పొన్నం స్పష్టం చేశారు.