సెప్టెంబర్‌ 30 తర్వాత సమరశీల పోరాటం…

తెలంగాణ ప్రజల 56 ఏళ్ల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి, గత మూడేళ్లుగా ప్రకటించిన తెలంగాణను ఏర్పాటు చేసేందుకు తండ్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నరు..ఇపుడు తెలంగాణ బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న ఓ అగ్ని పర్వతం..ముంచెత్తేందుకు సిద్ధంగా ఉన్న ఓ కడలి కెరటం..ఎట్లనైనా ఇగ తెలంగాణ తెచ్చుకోవాలన్న తండ్లాట తెలంగాణ ప్రజలది.. అందుకే సెప్టెంబర్‌ 30న మా తెలంగాణ మాగ్గావాలె అంటూ తెలంగాణ ప్రజలు ప్రభుత్వంపై తెలంగాణ ‘మార్చ్‌’ చేయనున్నరు..సెప్టెంబర్‌ 30న తెలంగాణ మార్చ్‌ తర్వాత కూడా కేంద్రం తెలంగాణపై దిగిరాకుంటే ఏం చెయ్యాలన్నది కూడా నిర్ణయిస్తరు..సెప్టెంబర్‌ 30వ తారీఖే తెలంగాణలోని రాజకీయ పార్టీలకు డెడ్‌లైన్‌..ఆ తర్వాత ఇగ ఉద్యమం వాళ్ల చేతుల్లో ఉండదు..ప్రజలే తమ చేతుల్లోకి తీసుకుంటుంది..2009లో కూడా అలాగే ప్రజలు ఊరూరా ఉధృతంగా ఉద్యమం నడిపిండ్రు..దాంతో బెంబేలేత్తిన ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసింది..దీని వల్ల ఏదో జరుగుతందని భ్రమ పడ్డ రాజకీయ నాయకత్వానికి అది క్రిష్ణ కమిటీ కాదు..ని’కృష్ట’కమిటీ అని తెల్సివచ్చింది..అయినప్పటికీ తెలంగాణవాదులు ఆత్మస్థైర్యం కోల్పోలేదు..ఉద్యమ పంథా వీడలేదు..ఎందుకంటే ఒక సాయుధ రైతాంగ పోరాటం..ఒక జగిత్యాల జైత్రయాత్రలాంటి అరుదైన ఉద్యమాలను నడిపిన ఘనమైన చరిత్రకు వారసులు తెలంగాణ ప్రజలు..వాళ్లకు పోరాటాలు కొత్తకాదు..ఎటొచ్చి పోరాట రూపాలలో మాత్రమే బేధం ఉంది..సాయుధ రైతాంగ పోరాటం నడిపిన ఘనమైన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నప్పటికీ 2009లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం పూర్తి శాంతియుత వాతావరణంలోనే జరిగింది..అయితే ఇక ముందు కూడా అలా జరుగుతుందని చెప్పలేం..ఎందుకంటే ఫేస్‌బుక్‌లలో తెలంగాణ వాదుల సందేశాలను…ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకొని జరుగుతున్న మెసేజ్‌ల యుద్ధాన్ని చూస్తే తెలంగాణ ప్రజలు సహనం కోల్పోయారని అర్థం అవుతుంది..ఇదే కొనసాగితే సెప్టెంబర్‌ 30న జరగనున్న తెలంగాణ మార్చ్‌ తర్వాత తెలంగాణ పోరాటం మిలిటెంట్‌ పంథాలోకి మారే అవకాశం కూడా ఉంది..ప్రజల మధ్య ఇప్పడికే బేధాభిప్రాయాలు వస్తున్నాయి…వైషమ్యాలు పెరగకముందే శాంతియుత వాతావరణం ఉన్నపుడే తెలంగాణను ప్రకటించాలి..గత కొద్దిరోజులుగా నెలరోజుల్లో తెలంగాణ..ఇగొచ్చె తెలంగాణ..అగొచ్చె తెలంగాణ అంటూ రాజకీయ నాయకత్వం ఇష్టమొచ్చినట్లు మొత్తుకుంటున్నది…ఆగస్టు 20లోగా తెలంగాణ ప్రకటించాలని లేదంటే ఇక ఉద్యమం ఉరుముతది అంటూ ఊదరగొట్టిన రాజకీయ నాయకత్వం ఇపుడు మైకులు బంద్‌ చేసుకున్నది…కేంద్రం తెలంగాణ ఇయ్యకుంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణ ఎట్ల తీస్కరావన్నో మాకు తెలుసన్న నాయకులు కేంద్రంలో ముడుచుకొని కూసున్నరు..ఇగ తెలంగాణ వచ్చే అవకాశం ఉన్న ఈ సమయంలో ఉద్యమాలెందుకన్న నాయకులు ఇంకా తెలంగాణ ఎందుకొస్తలేదని తెలంగాణ ప్రజలు అడిగితే ఏ మొఖం పెట్టుకొని సమాధానాలు చెప్తరో…అందుకే ఇగ తెలంగాణ ప్రజలు దొంగ ఉద్యమాలు చేసే నాయకులను నమ్మేందుకు సిద్ధంగా లేరు..అందుకే వారు ఇప్పిటికైనా నిజాయితీగా తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమించాలి…ఎందుకంటే తెలంగాణ సాధనకు జేఏసీ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ సందర్భంగా హైద్రాబాద్‌లో కదం తొక్కేందుకు ప్రజలు సిద్ధమయ్యిండ్రు..వారి ఆగ్రహానికి అడ్డుకట్ట వేయడం అసాధ్యం..అందుకే ఉద్యమం మిలిటెంట్‌ పంథాలోకి మారకముందే కేంద్రం దిగిరావాలి…నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం శ్రేయస్కరం…