సొసైటీల ద్వారా విత్తనాల సరఫరా

ఉమ్మడి జిల్లాకు సరిపడా విత్తనాలు సిద్దం  
ఖమ్మం,మే21(జ‌నం సాక్షి): జిల్లాలో పత్తి భారీ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగానే విత్తనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రానున్న ఆరునెలల కాలానికి అవసరమైన మేర ఎరువులకు సంబంధించిన ఇండెంట్‌ సైతం తయారుచేసిన అధికారులు మార్క్‌ఫెడ్‌ అధికారులకు పంపించారు. వానకాలం పంటల సాగు కోసం తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ అధికారులు అవసరమైన మేర విత్తనాలు సిద్ధం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు ఎంతమేర విత్తనాలు అవసరం ఉంటాయో మండల వ్యవసాయశాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. దానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు టీ సీడ్స్‌ కార్పొరేషన్‌కు ఇండెంట్‌ పంపించారు. నగర శివారులోని రఘునాథపాలెం మండలం టీ సీడ్స్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ప్రాసెసింగ్‌ యూనిట్‌లో శుద్ధి చేసిన విత్తనాలు సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఝాన్సీలక్ష్మీ కుమారి పలుమార్లు ఆయా ప్రైవేట్‌ విత్తన కంపెనీ డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా, డీఏపీ, ఇతర ఎరువులు సైతం ఆయా గోదాంలలో నిల్వ ఉంచారు. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్నిరకాల విత్తనాలు కలిపి 33వేల క్వింటాళ్లు అవసరం అయ్యే అవకాశం ఉండగా, ఇప్పటికే జిల్లా టీ సీడ్స్‌ కార్పొరేషన్‌ గోదాంలలో 18,174 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 99 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మరో 50 గ్రోమోరు సెంటర్ల ద్వారా విత్తనాల పంపిణీ చేపట్టాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
రైతుల అవసరాన్ని బట్టి రెండవ విడతలో మరికొన్ని విత్తనాలు సైతం పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు టీ సీడ్స్‌ అధికారులు పేర్కొంటున్నారు. విత్తనాల కోసం పట్టణాలు, నగర కేంద్రానికి రాకుండా వారివారి గ్రామాల్లో కొనుగోలు చేసుకునే విధంగా ప్రణాళికను రూపొందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 9,329 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటుందని ఆ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నిర్దారించారు. విత్తనాలు సిద్ధం చేసిన అధికారులు మరి కొద్ది రోజుల్లోనే సొసైటీలకు చేరవేయనున్నారు. వీటి ద్వారా అవసరమున్న రైతులకు అందచేస్తారు.