సోనియాతో ఎలాంటి విభేదాల్లేవు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులుండరు
మంత్రి వర్గాన్ని త్వరలో పునర్వ్యవస్థీకరిస్తాం
క్రీడలు, రాజకీయాలు రెండూ కలువరాదు
విచారణ దశలో ఫిక్సింగ్‌పై స్పందించను
జపాన్‌తో అణు ఒప్పందం త్వరలో అమలు
ప్రధాని మన్మోహన్‌సింగ్‌
న్యూఢల్లీి, మే 31 (జనంసాక్షి) :
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై స్పందిస్తూ.. రాజకీయాలు, ఆటలు కలిసిపోకూడదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గంలోని ఖాళీలను భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్‌, థాయ్‌లాండ్‌లో ఐదు రోజుల పర్యటన ముగించుకొన్న ప్రధాని తిరుగు ప్రయాణంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక విమానంలో మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. అనేక అంశాలపై ఆయన తన స్పందనను తెలియజేశారు. ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదం మొదలుకొని ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు, పొరుగు దేశాలతో సంబంధాలు, అంతర్జాతీయ అంశాలపై స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో విభేదాలున్నాయనే వార్తలపై ప్రధాని స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సోనియాతో తనకెలాంటి విభేదాలు లేవని, అన్ని అంశాల్లో తాము కలిసే పని చేశామని స్పష్టం చేశారు. సోనియా, తన నిర్ణయాల్లో ఎలాంటి తేడా ఉండదన్నారు. ‘అవన్నీ (సోనియాతో విభేదాలు) నిరాధారం. నాకు, కాంగ్రెస్‌ అధినేత్రికి మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అని చెప్పారు. జపాన్‌తో అణు ఒప్పందం త్వరలో అమల్లోకి వస్తుందని తెలిపారు.
క్రీడలు, రాజకీయాలు మిళితం కాకూడదు
రాజకీయాలు, క్రీడలు మిళితం కాకూడదని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత క్రికెట్‌లో బెట్టింగ్‌ రాకెట్‌ గురించి ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? అని ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ‘ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తులో ఉంది, విూరు ప్రశ్నించిన ఈ అంశంపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు’ అని బదులిచ్చారు. బీసీసీఐలో కీలక పదవుల్లో మంత్రులు సహా పలువురు రాజకీయ నాయకులు కొనసాగుతుండడంపై స్పందించేందుకు మన్మోహన్‌ నిరాకరించారు. ‘దీనిపై వ్యాఖ్యానించేందుకు ఇది సరైన సమయం కాదు. రాజకీయాలు, క్రీడలు మిళితం కాకూడదన్నదే నా అభిప్రాయం’ అని వ్యాఖ్యానించారు. విపక్షాలపై ధ్వజంపార్లమెంట్‌లో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరుపై మన్మోహన్‌ మండిపడ్డారు. సభను స్తంభింపజేసి విపక్షాలు విలువైన సమయాన్ని వృథా చేశాయని, సభా సంప్రదాయాలను మంటగలిపాయని విమర్శించారు. రాజ్యసభకు మరోమారు ఎన్నిక కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. 1991 నుంచి వరుసగా ఐదుసార్లు అస్సాం నుంచి ప్రాతినిథ్యం వహించడం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. మరోమారు అవకాశం కల్పించినందుకు మరింత చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. లెఫ్ట్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలతో పొత్తుపై స్పందిస్తూ.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మన్మోహన్‌ వ్యాఖ్యానించారు.
పాక్‌తో శాంతియుత చర్చలు
భారత్‌, పాక్‌ల మధ్య సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. పాక్‌తో ఉన్న విభేదాలను శాంతియుత ఒప్పందాలతో పరిష్కరించుకుంటామన్నారు. తమ దేశానికి రావాలని పాకిస్తాన్‌  ఆహ్వానించిందని… అయితే, ఎప్పుడు వెళ్లేది ఇంకా తేదీలు ఖరారు కాలేదని తెలిపారు. పొరుగు దేశంతో మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇరుదేశాల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామన్నారు.