సోలార్ విద్యుత్ వినియోగంపై ఆసక్తిగా ఉన్నాం

` ప్రతిపాదనలను అధ్యయనం చేస్తాం
` జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగం బలోపేతం లో భాగంగా సోలార్ విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రంగం పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం జర్మనీ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్ల తోపాటు గృహ జ్యోతి లబ్ధిదారులకు సోలార్ విద్యుత్ అందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా రైతులు, గృహ జ్యోతి వినియోగదారులకు ప్రతినెలా ఖచ్చితమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. జర్మన్ ప్రతినిధులు సూచించిన సోలార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అనుసంధానం చేసుకోగలం, తెలంగాణ విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేసుకోవడానికి జర్మన్ బృందం ప్రతిపాదనలు ఏ మేరకు ఉపయోగపడతాయో అధ్యయనం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు.జర్మనీ ప్రతినిధులు తీసుకొచ్చిన ప్రతిపాదనలపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సిఎండి ముషారఫ్ ఫారుకి, రెడ్కో సిఎండి అనిలా , జర్మన్ ప్రతినిధులు డాక్టర్ సెబాస్టియన్, డాక్టర్ రఘు చలిగంటి తదితరులు పాల్గొన్నారు.
దశలవారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం
` ట్రాఫిక్ సర్వేను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన చేపట్టాలి
` మొదటి దశలో రూ.10,986 కోట్లు కేటాయింపు
` అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొమటిరెడ్డి సమీక్ష
హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులను దశలవారీగా వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన సవిూక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణ పక్రియలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రోడ్ల రూపకల్పనలో ట్రాఫిక్ సర్వేలను పరిగణనలోకి తీసుకోవాలని, రోడ్లు ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హ్యామ్ ప్రాజెక్ట్ మొదటి దశకు సంబంధించిన టెండర్లను అతి త్వరలో పిలవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణం పారదర్శకంగా, నాణ్యతతో కూడిన విధంగా జరగాలని ఆయన పేర్కొన్నారు. అధికారులు, శాఖ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ కన్‌స్టలెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణం చేపడతామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మొదటి దశలో రూ.10,986 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు కోమటిరెడ్డి చెప్పారు. మొదటి దశ రోడ్ల నిర్మాణానికి వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల హ్యామ్ రోడ్లు.. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల రోడ్ల నిర్మాణం చేస్తామని వివరించారు.