సౌరశక్తితో దేశం ప్రగతి పట్టాలపైకి..

జాతీయ సోలార్‌ మిషన్‌ను ప్రారంభించిన ప్రధాని
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (జనంసాక్షి) : సౌరశక్తితో దేశం ప్రగతి పట్టాలపైకి చేరుతుందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా రానున్న నాలుగేళ్లలో అదనంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని సాధిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. 2017 నాటికి 55 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో జవహర్‌ లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ను ప్రధాని బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్‌ పరికరాలు తయారు చేసే కంపెనీలను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు. సోలార్‌, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర  ఇంధన వనరుల అభివృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. 2012లో 25 వేల మెగావాట్లుగా ఉన్న సంప్రదాయేర ఇంధన శక్తిని 2017 నాటికి 55 వేల మెగావాట్లకు పెంచనున్నట్లు తెలిపారు. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం, వాతావరణ మార్పులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండేందుకు అన్ని దేశాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతీ దేశం సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలన్నారు. కర్బన వాయు ఉద్గారాలకు బాధ్యత వహించాల్సింది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలేనని స్పష్టం చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారానే వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు.