స్కూల్లోనే డ్రగ్స్ తయారీ
` పట్టుకున్న పోలీసులు
` ఓ వైపు పాఠశాల నడిపిస్తూనే మరో వైపు డ్రగ్స్ తయారీ
` సికింద్రాబాద్ పాతబోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వెలుగు చూసిన ఘటన
హైదరాబాద్(జనంసాక్షి):మహానగరంలో ఏకంగా పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కలకలం రేపింది. ఒకవైపు పాఠశాల నడుపుతూనే మరో వైపు అదే పాఠశాలలోని రెండో అంతస్తులో మత్తు మందు తయారీ కర్మాగారం కూడా కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ పాతబోయిన్‌పల్లిలోని మేధా ప్రైవేటు పాఠశాలలో అల్ప్రాజోలం తయారీ కేంద్రం వెలుగు చూసింది. ఈగల్ బృందం పోలీసులు పాఠశాలపై దాడి చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. పక్కా సమాచారంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి పాఠశాలపై దాడి చేశారు. రెండంతస్తుల భవనంలో పాఠశాల కొనసాగుతుండగా.. రెండో అంతస్తులో అక్రమ దందా కొనసాగుతోంది. ఒక వైపు ఉన్న రెండు గదుల్లో పాఠశాల నిర్వాహకుడు జయప్రకాష్‌గౌడ్ అల్ప్రాజోలం తయారీ యంత్రాలతో మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం నుంచి పాఠశాలను జయప్రకాష్ గౌడ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. ఉదయం సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా పాఠశాల కొనసాగుతుండగా…పాఠశాల ఆవరణలోనే మరో రెండు గదుల్లో అల్ఫాజోలం తయారీ నిర్వహిస్తున్నట్టు ఈగల్ బృందం దాడుల్లో బయటపడిరది. ముడిసరుకు రసాయన దుకాణాల్లో కొనుగోలు చేసి తీసుకువచ్చి ఆరు నుంచి ఏడు సార్లు ప్రాసెస్ చేసి అల్ప్రాజోలంను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం పాఠశాల పదో తరగతి వరకు సాగుతోంది. అయితే చుట్టు పక్కల నివసించే వారికి కూడా ఎటువంటి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా దందా కొనసాగుతోంది. విషయం బయటపడడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు పాఠశాల నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు కోటి రూపాయల విలువైన 7 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులు అల్ఫోజోలంతో పాటు ఇంకా ఏమైనా మత్తు పదార్ధాలు తయారు చేస్తున్నారా? అనే కోణంలో ఈగల్ బృందం ఆరా తీస్తోంది. ఏకంగా పాఠశాల నిర్వహకుడే అక్రమ దందా చేయడం వెలుగులోకి రావడంతో విద్యార్ధులు తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.