స్టార్క్ జోరు – పాక్ బేజారు
తొలి వన్డేలో ఆస్టేల్రియా విజయం
షార్జా, ఆగస్టు 29: పాకిస్థాన్ పర్యటనను ఆస్టేల్రియా విజయంతో ఆరంభించింది. షార్జాలో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌ను ఆసీస్ పేసర్లు దెబ్బతీశారు. మిఛెల్ స్టార్క్ , పాటిన్‌సన్ ద్వయం ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో పాక్ 99 పరుగులకే 4 కీలకవికెట్లు కోల్పోయింది. హఫీజ్ 4 , అజార్ అలీ 5 , జంషెడ్ 23 , మిస్బాబుల్ హక్ 26 పరుగులకు ఔటయ్యారు. అయితే అసద్ షఫీక్ , ఉమర్ అక్మల్ నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు కూడా కంప్లీట్ చేసుకున్నారు. వీరిద్దరి జోరుకు స్టార్క్ బ్రేక్ వేశాడు. షఫీక్ 56 , అక్మల్ 52 పరుగులకు ఔటయ్యారు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న షాహిద్ అఫ్రిది కూడా డకౌటవంతో పాక్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. టెయిలెండర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. చివరకి పాకిస్థాన్ 45.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ 5 , పాటిన్‌సన్ 3 వికెట్లు పడగొట్టారు. 199 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్టేల్రియా కూడా తడబడింది. మహ్మద్ హఫీజ్ , అజ్మల్ ధాటికి 67 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుంది. డేవిడ్ వార్నర్ , మాథ్యూ వేడ్ , మైకెల్ హస్సీ , డేవిడ్ హస్సీ తక్కువ స్కోర్‌కే ఔటయ్యారు. ఈ పరిస్థుతుల్లో మైకేల్ క్లార్క్ , జార్జ్ బెయిలీ జట్టును ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో రాణించి జట్టును గెలిపించారు. విజయం ముంగిట క్లార్క్ ఔటైనా… బెయిలీ క్రీజులో ఉండడంతో ఆసీస్ 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. క్లార్క్ 66 , మ్యాక్స్‌వెల్ 38 పరుగులు చేయగా… బెయిలీ 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో అజ్మల్ 3 , హఫీజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఆస్టేల్రియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. 5 వికెట్లు పడగొట్టిన స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్‌లో రెండో వన్డే ఆగష్ట్ 31న అబుదాబీలో జరుగుతుంది.