స్థానిక ప్రతినిధులకు భారీగా పెరిగిన వేతనాలు
హైదరాబాద్,మార్చి13: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కు సముచిత గౌరవాన్ని కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం వారి జీతాలను భారీగా పెంచింది. వారిపై సిఎం కెసిఆర్ జీతాల వరాలు కురిపం చారు. ఇంతకాలం గౌరవ వేతనాల కోసం పోరాడుతున్న వారికి ఊరటనిచ్చేలా గతంలో ఎన్నడూ లేని విధంగా గౌరవ వేతనం పెంచారు. ఇది వచ్చే ఎప్రిల్ నుంచే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. ఊహించని విధంగా వారిజీతాలను పెంచుతూ సిఎం కెసిఆర్ శుక్రవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీంతో సర్పంచ్‌ల తో పాటు జడ్పీ ఛైర్మన్ల జీతాలు భారీగా పెరిగాయి. ప్రతిపక్షనేత జానారెడ్డి బడ్జెట్ ప్రసంగం ముగియగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని పెంచడానికి వారి వేతనాలను పెంచుతున్నమని తెలిపారు. ప్రభుత్వం పెంచిన జీతాల వివరాలిలా ఉన్నాయి. జెడ్పీ చైర్మన్లకు నెలకు రూ.7,500 నుంచి ఏకంగా రూ. లక్ష వరకు పెంచారు. జెడ్పీటీసీలకు రూ.2,250 నుంచి 10వేలు వరకు, ఎంపీపీలకు రూ. 1500 నుంచి రూ.10వేలు వరకు, ఎంపీటీసీలకు రూ.750 నుంచి రూ.5వేలకు, సర్పంచ్‌లకు రూ.5వేలు, మేయర్లకు రూ.14వేల నుంచి 50 వేలకు, డిఫ్యూటీ మేయర్‌ర్లకు రూ. 8వేల నుంచి 25వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారీగా భారం పడనుంది. సర్పంచ్‌లకు కేరళలో ఎక్కువ జీతాలు ఉన్నా అక్కడ తక్కువమంది సర్పంచ్‌లు ఉన్నారని అన్నారు. దీంతో ఇక్కడ సర్పంచ్‌లకు 5 వేలు గౌరవ వేతనం పెరునుంది. ఎంతోకాలంగా వారు గౌరవ వేతనం కోసం పోరాడుతున్నారు. టిఆర్‌ఎస్ నేతలు హర్షం ప్రకటించారు. సిఎం నిర్ణయాన్ని అధికారపక్ష సభ్యులు స్వాగతించారు. సిఎం ఉదారతకు ఇది నిదర్శనమని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత అన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై రీఇంజినీరింగ్
తెలంగాణ ప్రాజెక్టులపై రీ ఇంజినీరింగ్ జరగాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో బ్జడెట్‌పై చర్చ సంద ర్భంగా సీఎం మాట్లాడుతూ… సభ ముగిశాక శాసనసభ్యులందరూ కూర్చుని ప్రాజెక్టులపై చర్చిద్దామని సూచించారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు మనదికాదు, భూమి మనదైనా చక్కనీరు రాదని వివరిం చారు. గతంలో జరిగిన తప్పిదాలకు ఇప్పుడున్న ఎవరూ బాధ్యులు కారన్నారు.ప్రాజెక్టుల విషయంలో ఆంధ్ర పాలకులు తప్పుచేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సంద ర్భంగా ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చను చేపట్టారు. దీనిపై సీఎం స్పందిస్తూ… నాగార్జునసాగర్ మొదలు ప్రాణహిత-చేవెళ్ల వరకు అన్ని ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రా పాలకులది క్రూర పరిహాసం అని అన్నారు. ఏ ప్రాజెక్టుపై కూడా గత పాలకులు చిత్తశుద్ధితో పనిచేయలేదు. చెన్నారెడ్డి హయాంలో మాత్రమే తెలంగాణకు కొద్దిగా న్యాయం జరిగింది. తెలంగాణ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ జరగాలి. ప్రతీ పైసా ఖర్చు రైతులకు ఉపయోగపడాలి. జానారెడ్డి ప్రస్తావించిన అంశాలు వందశాతం సరియైనవి. ఆయన సలహాలను పాటిస్తం. అసెంబ్లీ సమావేశాల తర్వాత శాసనసభ్యులందరం కూర్చొని ప్రాజెక్టులపై చర్చిద్దామని సీఎం పేర్కొన్నారు.