స్థానిక సమరానికి సిద్ధం కండి

జూన్‌లో సర్పంచ్‌.. జూలైలో మునిసిపల్‌.. ఆగస్టులో జెడ్పీటీసీ ఎన్నికలు
త్వరలో డెబ్బైవేల ఉద్యోగాలు : సీఎం కిరణ్‌
గుంటూరు, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :  స్థానిక సమరానికి సిద్ధం కావాలని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఫిరంగిపురంలో ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. త్వరలో 60 నుంచి 70వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. జూన్‌లో సర్పంచు ఎన్నికలు.. జులైలో మునిసిపల్‌.. ఆగస్టులో జడ్‌పిటిసి, ఎంపిటిసి సీట్లకు ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు. వాటన్నింటిలోను మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ అమలు చేయను న్నట్టు వెల్లడిం చారు. డయల్‌ 100 అనే కార్యక్రమాన్ని ఉగాది రోజున హైదరాబాద్‌ లో ప్రారంభించామన్నారు. ఫిర్యాదు చేస్తే తమ వద్దకే పోలీసులొస్తారు.. ఫిర్యాదు స్వీకరిస్తారు.. రశీదు అందజేస్తారు.. తర్వాత కేసు పూర్వాపరాలను కూడా తెలియజేస్తారని చెప్పారు. ఇటీవల తెనాలిలో  జరిగిన దుర్ఘటన దురదృష్టకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో 2,25,00,000 మందికి లబ్ది చేకూర్చేందుకు గాను అమ్మహస్తం పేరిట 185 రూపాయలకే తొమ్మిది నిత్యావసర వస్తువులను అందజేస్తున్నామన్నారు. ఈ పథకాన్ని ఉగాదినాడు చేపట్టిన విషయం తెలిసిందేనన్నారు.ఏడాది పొడవునా అదే ధరకు ఆ తొమ్మిది నిత్యావసర వస్తువులను అందజేయనున్నట్టు తెలిపారు. అమ్మహస్తం కాదు మొండి హస్తమన్న చంద్రబాబు వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమన్నారు. తమకు తెలిసింది.. ప్రజలకు సేవ చేయడమేనని అన్నారు.
భారం మోపలేదు..
ఇటీవల పెంచిన విద్యుత్‌ ఛార్జీల్లో పేదలపై భారం మోపలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  50 యూనిట్లలోపు వినియోగించే ఎస్‌సి, ఎస్‌టిల తరఫున ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. అలాగే 0-50 యూనిట్లు వినియోగించే అందరూ వినియోగదారులపై కూడా గతేడాది ఉన్న చార్జీనే ప్రస్తుతం అమలు  చేస్తున్నామన్నారు. యూనిట్‌కు రూ.1.45పైసలు మాత్రమే వసూలు చేస్తున్నామన్నారు. మిగిలిన భారాన్ని  ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. 0-200 యూనిట్లు వినియోగించే వారందరికి మేలు చేశామన్నారు. వారిపై ఎటువంటి భారం మోపలేదన్నారు. రూ.6,300 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. రైతులకు కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నామని తెలిపారు. ఇన్ని చేస్తున్నా ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయన్నారు. వాస్తవాలను గుర్తించాలని వారిని కోరుతున్నానని అన్నారు.

కార్యకర్తలే న్యూస్‌ పేపరు.. టీవీ!

ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టబద్ధత, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామ గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ పార్టీ కార్యకర్తలే న్యూస్‌పేపరు.. టీవీ అని తెలియజేశారు. ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన నిధులు వారికే ఖర్చు చేసేందుకు యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ రూప కల్పనకు డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించి, అభిప్రాయాలను, సలహాలను, సూచనలను సేకరించి కేవలం రెండు నెలల్లోనే నివేదిక సమర్పించిందన్నారు. ఈ నివేదికపై అసెంబ్లీలో రెండు రోజుల పాటు చర్చకు పెట్టామన్నారు. సహజంగా అన్ని ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశించామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నడకకే ప్రాముఖ్యత ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులు అడ్డుకునేందుకు యత్నించాయన్నారు. ప్రభుత్వం మాత్రం ఎస్‌సి, ఎస్‌టిలకు మేలు చేకూర్చాలన్న ఏకైక లక్ష్యంతో కృషి చేసి ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించిందన్నారు. ఈ చట్టబద్ధతపై ఎస్‌సి, ఎస్‌టిలకు అవగాహన కల్పించేందుకే ఇందిరమ్మ కలలు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎస్‌సి, ఎస్‌టి, గిరిజనులకు, తదితరులకు సబ్‌ప్లాన్‌పై అవగాహన కల్పిస్తున్నా మన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ కింద ఈ ఏడాది బడ్జెట్‌లో 12,500 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు. ఈ ఏడాది ఆ నిధులు పూర్తిగా ఖర్చు కాకపోతే మిగిలిన వాటిని వచ్చే ఏడాది నిధుల్లో కలిపి వారికే ఖర్చు చేస్తామన్నారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని ఆ రెండు వర్గాల ప్రజలు ఎదగాలన్నారు. ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించడం వల్ల రాష్ట్రంలో ఒక కోటి 80 లక్షల మందికి మేలు చేకూరుతుందన్నారు.  వారి ప్రాంతాల అభివృద్ధికి, విద్యార్థుల చదువునకు, మౌలిక వసతులకు ఆ నిధులను ఖర్చు చేయనున్నామని వివరించారు. అలాగే బీసీలకు, మైనారిటీలకు, ఇతరుల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామన్నారు. బీసీలకు  తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు 158 కోట్ల రూపాయలను కేటాయిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికే రూ.4,027 కోట్లను కేటాయించిందన్నారు.అలాగే మైనారిటీలకు కూడా రూ.1,027 కోట్లు కేటాయించా మని వెల్లడించారు. ఆ నిధుల వల్ల 1,50,000 మందికి మేలు చేకూరుతుందన్నారు. రానున్న రోజుల్లో బీసీలకు, మైనారిటీలకు నిధులు మరింతగా పెంచనున్నట్టు వెల్లడించారు. మహిళలు 13వేల కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకుంటుంటే.. వారి తరఫున వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. అలాగే లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న రైతుల తరఫున ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోందని అన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ ఎంతో పాటుపడుతోందని చెప్పారు. విజ్ఞానపురంలో ఎస్‌సి, ఎస్‌టిలు కోరిన వాటిని మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కోరిన వాటిని కూడా మంజూరు చేస్తున్నామన్నారు. అంతేగాక జిల్లాలో అంబేద్కర్‌ భవన నిర్మాణానికి, అందులో ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన విద్యార్థులు ఐఎఎస్‌, ఐపిఎస్‌ శిక్షణ పొందేందుకుగాను హాస్టల్‌ వసతి కల్పించనున్నట్టు తెలిపారు.  అందుకుగాను 5 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా బహిరంగసభపై ఆశీనులైన కొందరు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు.