స్నేక్‌ గ్యాంగ్‌పై నేర నిర్ధారణ

4

– నేడు శిక్ష ఖరారు

హైదరాబాద్‌,మే10(జనంసాక్షి): హైదరాబాద్‌ పాతబస్తీని హడలెత్తించిన స్నేక్‌ గ్యాంగ్‌ అకృత్యాల కేసులో 8 మంది నిందితులను న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. వారికి బుధవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ స్నేక్‌ గ్యాంగ్‌పై మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టు విచారణ జరిపింది. 9 మంది నిందితుల్లో 8 మందిని నిందితులుగా నిర్ధారించింది. 9వ నిందితుడుగా ఉన్న పగల్‌ హండిల్‌ని మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. గ్యాంగ్‌ రేపుకు సంబంధించిన ఆధారాలు పోలీసులు చూపించలేకపోవడంతో దానిపై ఉన్న సెక్షన్‌ను కోర్టు తొలగించింది. బాధితురాలు కూడా కోర్టులో చెప్పలేకపోయింది. 8 మంది నిందితులకు పదేళ్ళు లేక జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అత్యంత క్రూరంగా వీరు అమ్మాయిలను పట్టుకుని పాములతో వేధించి వారిని రేప్‌ చేయడం, వారివద్ద ఉన్న డబ్బును లాక్కోవడం చేస్తూ రాక్షస వృత్తికి పాల్పడే వారు. ఎందరో మహిళలు దీనిని బయటపెట్ట లేకపోయారు. దీంతో ఓ మహిళ ధైర్యం చేసి పోలీసులకు సమాచారం అందించడంతో డొంక కదిలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్‌ గ్యాంగ్‌ కేసులో ఎనిమిదిమందిని రంగారెడ్డి జిల్లా కోర్టు దోషులుగా తేల్చింది. నగర శివారులో అకృత్యాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌ కేసులో న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెల్లడించింది. రెండేళ్ల క్రితం పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్లో వీరిపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. 2014 జులై 31న స్నేక్‌గ్యాంగ్‌ సభ్యులు ఫాంహౌజ్‌లో చొరబడి ఓ యువతిని పాముతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు నిందితులపై భారత శిక్షా స్మృతి 376డి, 341, 452, 323, 395, 506, 212, 411 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ప్రధాన నిందితుడు ఫైసల్‌ దయాని(ఎర్రకుంట), ఖాదర్‌ బరాక్బ(ఉస్మాన్‌నగర్‌), తయ్యబ్‌ బసలమ(బండ్లగూడ,బార్కాస్‌), మహ్మద్‌ పర్వెజ్‌(షాయిన్‌నగర్‌), సయ్యద్‌ అన్వర్‌(షాయిన్‌నగర్‌), ఖాజా అహ్మద్‌ (ఉస్మాన్‌నగర్‌), మహ్మద్‌ ఇబ్రాహీం (షాయిన్‌నగర్‌), అలీ బరాక్బ (షాయిన్‌నగర్‌), సలాం హండీ (బిస్మిల్లాకాలనీ)లను నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు నిందితులు చర్లపల్లి కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉండగా మిగతా ఇద్దరు బెయిల్‌పై బయటకు వచ్చారు.