స్వాతంత్య్రం వచ్చెనని సంబుర పడుదామా ?

అరవై ఆరవ స్వాతంత్య్ర దినోత్సవాలను కూడా యావత్‌ భారతదేశం ఎప్పటిలాగే ‘తుపాకుల నీడలో’ ఘనంగా జరుపుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ ‘కానుక’గా మణిపూర్‌లో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు బాంబుల మోతతో శుభాకాంక్షలు తెలిపాయి. అరవై ఆరేళ్లు గడిచినా సామాన్య భారతీయుడు స్వేచ్ఛగా ‘ఇండిపెండేన్స్‌ డే’ జరుపుకునే పరిస్థితి ఇంకా రాలేదని ఈ ‘మోత’ మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే ఈ గడిచిన అరవయ్యైదు ఏళ్లలో దేశం సాధించిందో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎర్రకోటపై జెండావిష్కరణ అనంతరం పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఆయన తన ప్రసంగంలో పేదరికాన్ని నిర్మూలించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని పేర్కొన్నారు. దీంతో సుసంపన్న భారతదేశంలో పేదరిక నిర్మూలనకు గడిచిన ఆరున్నర దశాబ్దాల కాలంలో పాలకులు చేసిందేమీ లేదన్నది స్పష్టమైపోయింది. నాడు శ్రీశ్రీ రాసిన ఓ పాటలో ”స్వాతంత్య్రం వచ్చెనని సంబుర పడగానే సరిపోదోయి.. ఆకాశమంటుకునే ధరలో వైపు.. అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు.. సాధించదానికి సంబుర పడిపోయి.. ఇదే విజయమనుకుంటే సరిపోదోయి.. కాంచవోయి నేటి దుస్థితి” అని 35 ఏళ్ల కిందట రాశాడు. ఆ పాట నాటి పరిస్థితులకు, నేడున్న పరిస్థితులకు బహు చక్కగా సరిపోతుంది. ఈ పాట వచ్చిన 35 ఏళ్ల కిందటున్న పరిస్థితే ఇప్పుడు కూడా ఉన్నది. నేటికీ సామాన్య భారతీయుడి ఆరోగ్యానికి గ్యారెంటీ లేదు. విద్యకు దిక్కు లేదు. ఈ రెండు పూర్తిగా వ్యాపార ధోరణిని పాటిస్తున్నాయి. ఉద్యోగమిచ్చే నాథుడు లేడు. దీనికితోడు నిత్యావసరాల ధరలు అకాశారన్ని తాకుతున్నాయి. పేదవాడు బుక్కెడు మెతుకుల కోసం అల్లాడే పరిస్థితి. దేశంలో సగటున 7 వేల మంది ఆకలితో చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. కానీ, పాలకులు మాత్రం తాము చేసిన అరకొర అభివృద్ధినే భూతద్దంలో చూపడానికి అలవాటు పడ్డారు. దీనికి చట్టసభల్లో నిర్మితమవుతున్న చట్టాలే. ఎందుకంటే, జైళ్లలో ఉండాల్సిన వాళ్లు చట్టసభలకు ఎన్నికవుతున్నారు. ఎన్నికయ్యాక చేసే చట్టాలు వాళ్లకు చుట్టాలవుతున్నాయి. ఫలితంగా, రాజీవ్‌గాంధీ హయాంలో జరిగిన బోఫోర్స్‌ కుంభకోణంలో 60 కోట్ల అవినీతి జరిగిందంటే ముక్కున వేలేసుకున్న సగటు భారతీయుడు, ఆ తర్వాత జరుగుతున్న స్కాంలు చూసీ చూసీ కొన్ని రోజుల కిందట లక్షా 72 వేల కోట్ల 2జీ స్కాం వార్త విని ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే, ఈ వ్యవస్థ మారదు, పాలకులు మారరు అని నమ్ముతున్నాడు కాబట్టి. దేశంలో జరిగిన అన్ని స్కాముల్లోనూ ప్రజాప్రతినిధులదే ప్రధాన పాత్ర. అటువంటప్పుడు ఓ సామాన్యుడు పాలకులను ఎలా నమ్ముతాడు ? అంతెందుకు, అక్రమంగా 26 జీవోలు విడుదల చేసి, కొందరి జేబులు నింపిన రాష్ట్ర అమాత్యులు సీబీఐ చార్జిషీటు వారి పేర్లు పేర్కొనే వరకు కూడా తమ పదవులకు రాజీనామా చేయడం లేదు. వాళ్లకున్న పదవీ వ్యామోహం అలాంటిది. దీనికి నిన్నగాక మొన్న రాజీనామా చేసిన మంత్రి ధర్మాన వ్యవహారమే సాక్ష్యం. నేరమే అధికారమైనట్లు నేరస్థులంతా చట్టసభల్లో కూర్చుని, చట్టాలు చేస్తుంటే ప్రజాస్వామ్యం కాస్త ధనస్వామ్యం కాకుండా ఇంకేమవుతుంది ? సామాన్యుడి ఆయుధంగా రాజ్యాంగంలో అభివర్ణించబడ్డ ‘ఓటు హక్కు’ నేటి రాజకీయ నాయకులకు ఓ వ్యాపారంగా తోస్తున్నది. ఓటు కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ ఓటుతో గెలిచి లక్షల కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తాము కృషి చేస్తున్నామంటూ రోజూ చెప్పుకునే రాజకీయ నాయకులకు, తాము పదవులు అనుభవించడానికి కారణమైన, భారతదేశానికి స్వేచ్చా వాయువులు ప్రసాదించేందుకు తమ సర్వస్వం ధారపోసి, ప్రస్తుతం వృద్ధాప్యంతో, అవసాన దశలో నాటి స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్‌ ఇప్పించాలని కూడా ఏనాడూ అనిపించడం లేదు. తెల్ల దొరల నుంచి దేశాన్ని నల్ల దొరలకు అప్పగించామా.. అని ఆ ‘యోధులు’ నిత్యం మథనపడుతూనే ఉన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తామని నమ్మబలుకుతున్న ప్రజాప్రతినిధులు పేదలనే నిర్మూలించే దిశగా తమ వ్యవహారాలు నడుపుతున్నారు. పేదల ఆస్తులను కాజేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అభివృద్ధి పేరిట రోడ్డు పక్కన బతికే అభాగ్యులను రోడ్డుపైకి తెస్తున్నారు. అటవీ సంపద దోపిడీకి అడ్డుగా ఉన్నారని ఆదివాసులను అక్కడి నుంచి తరిమేసేందుకు పన్నాగాలు చేస్తున్నారు. ఇదేనా అభివృద్ధి ? ఎవరూ సాయం చేయకున్నా.. తమ బతుకేదో తాము బతుకుతున్న పేదలకు బుక్కెడు బువ్వ లేకుండా చేయడమేనా పురోగతి ? ఇందుకేనా.. 2 వందల ఏళ్లపాటు తెల్లదొరలను ఎదిరించి, తమ మానప్రాణాలను త్యాగం చేసి స్వాతంత్య్ర సమరయోధులు దేశానికి స్వేచ్ఛ ప్రసాదించింది ? ముమ్మాటికీ కాదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో ఇప్పటికే కనిష్ట స్థాయిలో ఉన్న రూపాయి మారకం అంతర్జాతీయ స్థాయిలో ఇంకా అత్యంత కనిష్ట స్థాయికి పడిపోకమానదు. దీంతో ఏర్పడే ద్రవ్య లోటు దేశంలో పెను సంక్షోభాన్ని సృష్టించవచ్చు. ఈ వైపరిత్యాలను తట్టుకోలేక దేశ ప్రజలు ప్రత్యామ్నాయ పరిస్థితుల వైపు అడుగులు వేసే ప్రమాదముంది. దీనికి ఈ మధ్య చాలా దేశాల్లో అధికార మార్పిడికి జరిగిన ఉద్యమాలే సజీవ సాక్ష్యం. ఇలాంటి దుస్థితి రాక ముందే ప్రస్తుత పాలకులు పటిష్ట నాయకత్వాన్ని నిర్మించాలి. ప్రజాకర్షక విధానాలను అమలు చేయాలి. సగటు భారతీయుడు రెండు పూటలా కడుపు నింపుకుని, రోజురోజుకు సామాజికంగా, ఆర్థికంగా బలపడే చట్టాలను చేసి అమలు చేయాలి. దేశంలోని అన్ని పార్టీలు అవినీతిపరులకు టికెట్లు ఇవ్వకుండా, కనీస విద్యార్హత ఉన్నవారికే తమ పార్టీ నుంచి చేయించాలి. ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించునే దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.