స్వీయ రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదిగితేనే తెలంగాణ

కరీంనగర్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి) :
స్వీయ రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదిగితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం నగరంలోని సర్కస్‌గ్రౌండ్‌ (పోలీసు కిష్టయ్య ప్రాంగణం)లో నిర్వహించిన కదనభేరి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఉద్యమాన్ని కొనసాగిస్తూనే దానికి సమాంతరంగా స్వీయరాజకీయ శక్తిగా ఎదిగి నిలబడేందుకు టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగు వేస్తుందని అన్నారు. ఎన్నికలప్పుడు ఎవ్వరూ కూడా ఆగమాగం కావద్దని విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఆలోచించి ఓటు వేయ్యాలని చెప్పారు. గాడిదలకు గడ్డివేసి, ఆవులకు పాలు పితికితే రావని, ఆవులకే గడ్డి వేయాలని సూత్రికరించారు. తెలంగాణ కోసం ఇరవై మంది ఎమ్మెల్యేలు పోరాటం చేస్తేనే ఇంతగా ప్రభుత్వం స్తంభించిపోతుందని, అదే వందమంది ఎమ్యెల్యేలు, పదో, పదహారో మంది ఎంపిలుంటే మనం లేకుండా ఏ పార్టీ ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో అధికారంలోకి రాలేవన్నారు. రాబోతున్నదని సంకీర్ణ రాజకీయ యుగమని, ఏ ఒక్క పార్టీ కూడా మనం లేకుండా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చేపట్టబోదని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచలుగా భావించి రాజీనామా చేస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఇంకా ఏం చేయాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు చేయని ఉద్యమం లేదని, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో శాంతియుతంగా సాగుతోందని అన్నారు. ఇంతటి పోరాటాన్ని కూడా గుర్తించలేని మన ప్రధాని దద్దమ్మ అని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని, అప్రజాస్వామికంగా కేంద్రం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర పార్టీలు కూడా తెలంగాణ ప్రజలను దగా చేశాయన్నారు. ఆంధ్రా పార్టీలు, మీడియా మాయలో పడి ఆగం కావద్దని తెలంగాణను ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశించిన రీతిలో యాచించి కాకుండా శాసించి తీసుకుందామన్నారు. నారదాసు లక్ష్మణ్‌రావు తాడిత పీడిత ఉద్యమంలోంచి వచ్చాడని తెలంగాణ కోసం స్వీయ రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ ఎదిగేందుకు ఆయన కమాలాకర్‌కు అవకాశం ఇస్తూ స్వచ్ఛందంగా తప్పుకున్నాడని కీర్తించారు. నారదాసు లక్షణ్‌రావుకు ఇంతకంటే మంచి స్థానం ఇస్తామని బహిరంగ సభలో ప్రకటించారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న పోలీసు కిష్టయ్య భార్య పద్మకు కరీంనగర్‌లో మంచి ఇల్లు కట్టించేందుకు ఎమ్యెల్యే కమలాకర్‌ ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడని కేసీఆర్‌ ప్రకటించడంతో పోలీసుల్లో కూడా ఉత్సాహం కనిపించింది.