హత్య

జన్మలంటూ ఉంటే ఏజన్మలో చేసుకొన్న పాపమో ఆ సంఘ టనని చూడటం. క్షమించాలి ఇంతకుమించి మరో ఉపమానం దొరకలేదు. ఆ దుర్ఘటనని చూసి వెళ్ళిపోతే పుణ్యమైనా ఉండేది. కానీ నా రెండో పాత్ర నన్ను ఊరుకోనివ్వలేదు. కళ్ళు మూసుకొని నా దారిన నేను పోనందుకు తగిన ఫలితాన్నిఏ అనుభవించాను. అందుకు నన్ను నేను లక్షా తొంభైసార్లు తిట్టుకొన్నాను. ఆరోజు ఆదివారం. సాయంత్రం నాలుగవుతోంది. సైకిల్‌ మీద సిద్దిపేటకి బయల్ధేరాను. గతుకుల రోడ్డు, రోడ్డు ఇంకా రిపేరులోనే ఉంది. దాబా హోటల్‌ దాటి సిద్ధిపేట ఊరు పొలిమేర్లలో ఆ దుర్ఘటన జరిగింది. సిద్ధిపేట నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ సైకిల్‌ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఆ తాకిడికి ఆ వ్యక్తి ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. తలకి బలమైన గాయాలై రక్తంతో మడుగైంది. హతాశుడనైపోయాను. క్షణం క్రితం వరకు హామీగా వెళ్తున్న వ్యక్తి ఎంతలో ఎలా మరిపోయాడు. యాక్సిడెంట్‌ తర్వాత లారీని అక్కడే వదిలేసి లారీ డ్రైవర్‌ పారిపోయాడు. ఆ వ్యక్తి రోడ్డు మీద కొట్టుకొంటున్నాడు. ఆ భీభత్స దృశ్యంతో గుండె విపరీతంగా కొట్టుకోవడం మొదలైంది. అక్కడి నుంచి వెళ్ళిపోదామనుకోన్నాను. నా రెండో పాత్ర మెల్కోంది. ఆ వ్యక్తికి సహాయం చెయ్యమని నన్ను ఆదేశించింది. సైకిల్‌ అక్కడ పడేసి ఆ వ్యక్తి దగ్గరికెళ్ళాను. త్వరగా హాస్పిటల్‌కి తీసుకెళ్తే బతుకొచ్చేమోననిపించింది. ఎదురుగా వస్తున్న ఆటోని ఆపి ఆటో డ్రైవర్‌ సాయంతో అతన్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాను. మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది హాస్పిటల్‌. నా బట్టలు, చేతులు అన్ని రక్తంతో తడిసిపోయ్యాయి. వార్డ్‌బాయ్‌ ఇద్దరు ఆయాలు తప్ప అక్కడ ఎవరూ లేరు. వార్డ్‌బాయ్‌ సాయంతో ఆ వ్యక్తిని వార్డులోకి తీసుకువెళ్ళాం. ఆయా డాక్టర్‌కి ఫోన్‌ చేసింది. ఆరగంట తర్వాత డ్యూటీ డాక్టర్‌ వచ్చాడు. అతని మోఖం చిరాగ్గా ఉంది. అతనికి ముఫ్పై ఏళ్ళుంటాయేమో. ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ని వదిలి పెట్టి వచ్చినందుకు బాధగా ఉన్నట్టుంది. గాయాలైన వ్యక్తి వైపు చూ శాడు. అతన్ని ఎవరు తీసుకొచ్చారని ఆయాని అడిగాడు. ఆయా నన్ను చూపించింది.

”అతని పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. హైద్రాబాద్‌ తీసుకెళ్ళాలి. ఇక్కడ రక్తం దొరకదు. ఆపరేషన్‌ కూడా అవసరం ఉండొచ్చు” చెప్పాడు. పేషంట్‌ని కనీసం చూడను కూడా చూడకుం డానే. నా పరిస్థితి అంతా చెప్పాను. ఎందుకు తెచ్చానన్నాడు. ఏం చెప్పాలో తోచలేదు. లారీ నెంబర్‌ గురించి, డ్రైవర్‌ గురించీ అడిగా డు. తెలియదని చెప్పాను. నా పేరూ, అడ్రస్‌ అడిగి రాసుకొ న్నా డు. నా సంతకం తీసుకొన్నాడు. యాక్సిడెంట్‌ ఇంటిమేషన్‌ రాసి పోలీస్‌ స్టేషన్‌లో ఇవ్వమి చెప్పాడు. మిగితా విషయాలు వాళ్ళు చూసుకోంటారని చెప్పాడు. నాకు భయమేసింది. వెంటనే అక్కడి నుంచి పరుగు తీశాను. యాక్సిడెంట్‌ జరిగిన స్థలం వద్దకొచ్చాను. లారీ ఇంకా అక్కడే ఉంది. నంబర్‌ నోట్‌ చేసుకొన్నాను. అక్కడి నుంచి నా సైకిల్‌ తీసుకొని పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళాను. అక్కడి వాతా వరణాన్ని చూస్తే భయమేసింది. ఇంటికి వెళ్ళిపోదామ అనిపిం చింది. మృత్యుమోఖంలో ఉన్న ఆ వ్యక్తి పరిస్థితి గుర్తొచ్చింది. సైకిల్‌ని ప్రక్కన ఆపి స్టేషన్‌లోకి వెళ్ళాను. సెంట్రీ నన్నూ, నా బట్టల్నీ చూఇ ఆపి విచారించాడు. విషయమంతా చెప్పాను. లోనికి పంపించాడు. ఎస్సై లేడు, వెనుక రూంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఉన్నాడని చెప్పాడు. వెనుక రూంవైపు భయం భయంగా వెళ్ళాను.
కుర్చీ మీద కూర్చొని టెబిల్‌పైన కాళ్ళు పెట్టి సిగరెట్టు త్రాగుతూ హెడ్‌ కానిస్టేబుల్‌ కన్పించాడు. అతని కెదురుగా ఎవరో వ్యక్తి చేతులు కట్టుకొని నిల్చున్నాడు. గుండె నిండా ధైర్యం తెచ్చుకొని అక్కడికి వెళ్ళాను. ”ఎమిటీ” అన్నట్టు నా వైపు చూశాడు. డాక్టర్‌ ఇచ్చిన ఇంటిమేషన్‌ అతనికిచ్చాను. చూశాడు. నా వైపు వింతగా చూశాడు.
”ఏం పేరు?
అడిగాడు ఆదోలా ముఖం పెట్టి. చెప్పాను వూరు..?
చెప్పాను, ఏం చేస్తుంటావు..?
చెప్పాను. ఎక్కడ జరిగింది..?
చెప్పాను. ఎన్నిగంటలకి జరిగింది…?
చెప్పాను, ఎట్లా జరిగింది..?
చెప్పాను. లారీ నెంబర్‌…?
చెప్పాను. ”డ్రైవర్‌ పేరేమిటీ..?
”తెలియదు సార్‌! అతను యాక్సిడెంట్‌ కాగానే పారిపోయాడు. ”అతన్ని ఎందుకు పట్టుకోలేదు. ఏం చెప్పాలో తోచలేదు. ”ధరకాస్తు రాసుకొచ్చావా..?
”లేద్సార్‌! ఇప్పుడు రాసుకొస్తాను”
కొంచెంసేపు ఆలోచించి, టేబిల్‌ డ్రాయర్‌ నుంచి తెల్ల కాగితాలు తీసి వీటి మీద సంతకాలు పెట్టు అన్నాడు. తెల్ల కాగితాల మీదద సంతకాలు పెట్టాలా వద్దా సంకోచించాను. ”ఏం సంగతీ, బాగా ఆలోచిస్తున్నావు. సంతకాలు పెట్టమంటే గద్దిరించాడు. దాంతో ఆలోచించకుండా సంతకాలు పెట్టాను. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళొచ్చా..? అన్నట్టుగా అతనివైపు చూశాను. ”అమీన్‌ సాబ్‌ అరగంటలో వస్తారు. అప్పటిదాకా బయట చెట్టు క్రింద కూర్చొ” ఆర్డరేశాడు.
”ఆ వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉంది హైద్రాబాద్‌ తీసుకెళ్ళాలిట సార్‌” గుర్తు చేశాను. నువ్వే తీసుకపోయిక పోయినావు వ్యంగ్యంగా జవాబిచ్చాడు. మారు మాట్లాడకుండా బయట చెట్టు క్రింద వచ్చి నిల్చున్నాను. ఏడున్నర ప్రాంతంలో ఎస్సై వచ్చాడు. కాస్సేపటికి నన్ను పిలిచాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ అడిగిన ప్రశ్నలే మళ్ళీ ఎస్సై అడిగాడు. జవాబులు చెప్పాను. ఆ వ్యక్తిని హైదరాబాద్‌ తీసుకె ళ్ళాల్సి ఉంటుందని గుర్తు చేద్దామనుకొన్నాను. ఏం చెబితే ఏమంటా రోనని భయమేసి ఊరుకొన్నాను. కాస్సేపటికి హెడ్‌ కానిస్టేబుల్‌ దగ్గర అనుమతి తీసుకొని బయటపడ్డాను. ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో, అతని బంధువులు ఎవరైనా తెలిసి వచ్చినారో చూద్దామని సైకిల్‌ తీసుకొని హాస్పిటల్‌ వైపు వెళ్ళాను. ఇంకా అతని పరిస్థితి అలాగే ఉంది. డాక్టర్‌ లేడు. ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అతనికివ్వలేదు. ఆయా అక్కడ ఉంది.
”అతని బంధువులెవరైనా వచ్చారా..? అడిగాను.
”ఇప్పుడే ఎవరో ఇద్దరు వస్తే హైద్రాబాద్‌ తీసుకెళ్ళాలని డ్యూటీ డాక్టర్‌ చెప్పాడు. వాళ్ళు జీపు తీసుకురావడానికి వెళ్ళారు. జవాబు చెప్పింది. కాస్సేప్పట్లో వాళ్ళోచ్చారు. జీపుతోబాటు. ఆ వ్యక్తిని జీపు లోకి ఎత్తుకెళ్ళి కూర్చొబెట్టారు. ఒకరిద్దరు ఏడుస్తూ నిల్చున్నారు. ఆ తరువాత నేను ఇంటి మొఖం పట్టాను. ఓ రెండు రోజుల తర్వాత మళ్ళీ నన్ను స్టేషన్‌కి పిలిచారు. మళ్ళీ ఏవో ప్రశ్నలు ఆడిగారు. అప్పుడు తెల్సింది. ఆ వ్యక్తి బొల్లారం వెళ్ళేసరికి మరణించాడని. అతనికి సరైన ట్రీట్‌మెంట్‌ దొరికితే బతికేవాడేమో. చాలాకాలం ఈ విషయం జ్ఞప్తికొచ్చేది. కాలక్రమంలో యాక్సిడెంట్‌ విషయమే మర్చి పోతున్న సమయంలో ఏడాదిన్నర తరువాత ఒకరోజు ఉదయం కానిస్టేబుల్‌ వచ్చాడు మా ఇంటికి. మా ఇంట్లో వాళ్ళందరు భయప డిపోయారు. నేనూ కొంత గాబరాపడ్డాను. అతను కోర్టు సమన్స్‌ తెచ్చాడు. సంతకం చేసి తీసుకొన్నాను. సమన్స్‌లో తెలిపిన తేదీన కోర్చుకొచ్చి యాక్సిడెంట్‌ కేసు సాక్ష్యం చెప్పాలన్నాడు. ఆ రోజు రానట్లయితే వారంట్‌ అవతుందని హెచ్చరించాడు. ఆ సమన్‌ కాగితాన్ని భద్రంగా నా జేబులో పెట్టుకొన్నాను. రోజులు లెక్కపెట్టు కొంటూ ఉండగా ఆ రోజు రానే వచ్చింది. ఉదయమే లేచి రెడీ అయ్యాను. సైకిల్‌ తీసుకొని కోర్టుకి బయల్దేరాను. అది మొదటిసారి కోర్టుకి వెళ్ళడం ఏడో తరగతి పరీక్షకి వెళ్తున్నట్టుగా అన్పించింది. ఆ రోజు సంఘటనంతా గుర్తుకు వచ్చింది. మనస్సంతా బాధతో నిండిపోయింది. పదిగంటల ప్రాంతంలో కోర్టు దగ్గరికి వచ్చా ను.
అదొక పూరాతనమైన బిల్డింగ్‌. అప్పటికే అక్కడ చాలామంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు సంభాషి ంచుకొంటూ ఉన్నారు. ఓ మూలన నిల్చొని ఉన్నాను వాళ్ళని చూస్తూ కుర్రవాళ్ళు మగవాళ్ళు క్లయిం ట్లతో మాట్లాడుతూ అడ్వకేట్లు అక్కడ ఎవరిని కలవాలో, ఏం చెయ్యాలో తోచలేదు. చెట్టు కింద అలాగే నిల్చొని ఉన్నాను. కాస్సేపటికి నాకు సమన్స్‌ ఇచ్చిన కానిస్టేబుల్‌ కన్పించాడు. పరుగె త్తికెళ్ళి అతన్ని కలిశాను. నన్ను పోలీస్‌ ప్రాసిక్యూటర్‌ గదిలోకి తీసుకువెళ్ళాడు. అదొక చిన్నరూం. మూడు కుర్చీలు ఓ టేబిల్‌ అతను కుర్రవాడిలాగే ఉన్నాడు. సాక్ష్యం ఎలా చెప్పాలో ఎవరికో వివరిస్తున్నాడు. కాసేప టికి ఇంకో కానిస్టేబుల్‌ నన్ను కోర్టు హాలు దగ్గర వచ్చి నిల్చోమని చెప్పాడు. కేసు పిలిచిన తరువాత వాయిదా తేదీ రాసి ఇస్తానని చెప్పాడు. ఓగంట తరువాత మా కేసు పిలిచారు. నేను కూడా లోప లికి వెళ్ళాను. వాయిదా తేదీ రాసి ఇచ్చాడు. ఆరోజు మళ్ళీ సమన్స్‌ రాదని, నేను రావాలని చెప్పాడు. రాకపోతే వారంట్‌ అవుతుందని కూడా హెచ్చరించాడు. ఆ కాగితం జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తరువాత నాలుగైదుసార్లు కోర్టుకి వచ్చాను. నా బయానా మాత్రం కాలేదు. ఓ సారి ఏపీపీ సెలవు మీద ఉన్నా డని, ఓసారి ముద్దాయి రాలేదని, మరోసారి ముద్దాయి న్యాయవాది లేడని, మరోసారి సెలవుగా ప్రకటించారని ఏదో కారణంగా కేసు వాయిదా పడుతూ వచ్చింది. ప్రతిసారీ ఉదయాన్నే లేచి తయారై రావడం కేసు వాయిదా పడటం మామూలైపోయింది. ఓసారి ఖర్చు లకిగాను ముఫ్పై రూపాయలు కూడా ముద్దాయి నుంచి ఇప్పిం చారు. ప్రతిసారీ వచ్చే వాయిదాకి వస్తానని బాండ్‌ రాయిం చుకొన్నాను. సిన్సియర్‌గా ప్రతిసారీ వచ్చి వచ్చే వాయిదాకి వస్తానని బాండ్‌ రాయించుకొన్నారు. సిన్సియర్‌గా ప్రతిసారీ వచ్చి నిరుత్సాహపడిపోయాను. విసుగెత్తిపోయాను. ఇంకా ఎంతకాలం ఈ కోర్టు చుట్టూ తిరగాలో అర్థం కాలేదు. చివరి వాయిదా వచ్చిం ది. ఆరోజు కూడా ఎప్పటిలాగానే పదిగంటలకి వచ్చి ఏపీపీ రూం వద్దకి వచ్చి నిల్చున్నాను. కాస్సేపటికి అతను వచ్చాడు. నన్ను లోప లికి పిలిచాడు. నేను కోర్టులో చెప్పాల్సిన కాగితం ఇచ్చి చదు వుకోమన్నాడు. చదువుకొన్నాను. నేను చూసిన దానికన్నా ఎక్కువగా ఉంది. నేను పోలీసులకి చెప్పినదాని కన్నా ఎక్కువగా ఉంది. అదే విషయం అతనికి చెప్పాను.
”అంతే కాదు నేరస్థల పంచనామా కూడా నీ ముందు జరిగినట్టుగా రికార్డు ఉంది” చెప్పాడు.
”అప్పుడూ నేను లేను సార్‌. తెల్లకాగితాల మీద సంతకాలు తీసుకొని నన్ను పంపించేశారు.”
నేరస్థల పంచనామా కాగితం తీసి నాకు చూపించాడు. ఫిర్యాదు కాగితం చూపించాడు. వాటి మీద నా సంతకాలు ఉన్నాయి. నేరస్థల పంచనామా నా ముందు జరిగినట్టుగా రాసి ఉంది. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఫిర్యాదు ఇచ్చినట్టుగా ఉంది. ఏం చెయ్యాలో తోచలేదు. ఏసీపీనే అడిగాను. ”అనవసరంగా చిక్కుల్లో పడకుండా ఈ కాగితాల్లో ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పు” అన్నాడు. అది సలహానో, బెదిరింపో అర్థం కాలేదు. కష్టాలు తెచ్చుకోవడం ఇష్టంలేక సరే నన్నాను. మిగితా సాక్షులతో మాట్లాడి, కోర్టు సమయం కావడంతో కోర్టులోకి వెళ్ళిపోయాడు.
కోర్టు హాలు ముందున్న వరండాలో నిల్చున్నాను. ముద్దాయి లతోని, సాక్షులతోని, కోర్టు పక్షలుతోని, వాది ప్రతివాదులోతని న్యాయవాదులతోని వరండా అంతా పెళ్ళిసందడిలా ఉంది. జైలు నుంచి తీసుకొచ్చిన ఖైదీలను దూరంగా నిల్చోబెట్టి కొంతమంది పోలీసులు కాపలా కాస్తున్నారు. వరండాలో స్థలం లేక కొంతమంది దూరంగా ఉన్న వేపచెట్ల క్రింద బాతాఖానీ కొడ్తున్నారు. కొంత మంది బీడీలు కాలుస్తున్నారు. ఇంకా కొంతమంది చుట్టలు సిగరే ట్లు కాలుస్తున్నారు. న్యాయవాదులు కోర్టులోకి పోతూ వస్తు ఉన్నా రు. ముద్దాయిలని పిలుస్తున్నారు. తమ పిలుపు వినరాగానే వాళ్ళు పరుగుపరుగున కోర్టుహాల్లోకి వెళ్తున్నారు. బయట గొడవ ఎక్కువ కావడంతో కోర్టు అటెండర్‌ వచ్చి అందరినీ దూరంగా తరిమేశాడు. గొడవెందుకని నేను దూరంగా వెళ్ళి నిల్చున్నాను. గంటన్నర తరు వాత సాక్షులని పిలవడం మొదలైంది. టీ త్రాగాలనిపించింది. కానిస్టేబుల్ని అడిగాను. నా కేసు పిలుస్తారు వెళ్ళొందని చెప్పాడు. చేసేదేమీ లేక అసహనంగా అక్కడే నిల్చున్నాను.
నా పేరుని గట్టిగా హాజిరిహై అని కోర్టు అటెండర్‌ పిలిచాడు. టక్కున కోర్టు హాల్లోకి వెళ్ళి నిల్చున్నాను. ఎక్కడ నిల్చోవాలో అర్థం కాలేదు. ఎపీపీ దగ్గరి వెళ్ళాను. అతను బోనులో నిల్చోమ్మని చెప్పాడు. అదొక చిన్నహాలు. దాదాపు సగం వరకు ఆక్రమిం చిన బెంచి. దాని మీద ఎత్తైన కుర్చీ. నల్లటి దుస్తులో శోకదేవు నిలా మేజిస్ట్రేట్‌.ముఫ్పై ఐదేళ్ళుంటాయేమో. బోను ఎక్కగానే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ముఖం నిండా చెమటలు పడుతున్నాయి. నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నాను. బెంచి క్లర్క్‌ దేవుని మీద ప్రమాణం చేయించాడు. నా పేరు ఇంతర వివరాలు అడిగి రాసుకొన్నాడు. ఆ తరువాత ఎపీపీ నన్ను అడగటం ప్రారంభించాడు. అతని ఛాంబర్లో చదివిందంతా చెప్పాను. నేనే చూసిందీ, చూడనిదీ అంతా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాను.
”ముద్దాయి న్యాయవాది. మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అర్థం చేసు కొని సమాధానాలు చెప్పడిం” ఎపీపీ నాకు చెప్పి తన కుర్చీలో కూర్చున్నాడు.
సైకిల్‌ మీద ప్రయాణం. మూడు నాలుగు గంటల నుంచి నిల్చోడం. కాళ్ళు పీకుతున్నాయి. ఇంకా గుండె వేగంగా కొట్టుకొంటూనే ఉంది. ముద్దాయి న్యాయవాది బోను దగ్గరికొచ్చా డు. అతనికి కూడా ముఫ్పై ఐదేళ్ళుంటాయేమో నాలాంటి సాక్షుల్ని చాలామందిని చూసి ఉంటాడేమో.
”నీ పేరేమిటీ..?
ప్రశ్నించాడు నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ తరువాత ఊరి పేరు, వృత్తీ ఇతర వివరాలు అడిగాడు. జవాబులు చెప్పాను. మేజీస్ట్రేట్‌ అన్ని రాసుకొంటున్నాడు. ”ఆ రోజు దేనిపైన బయల్ధేరావు” నా సైకిల్‌పైన, ఎన్ని గంటలకి బయల్ధేరావు నాలుగ్గం టల ప్రాంతంలో లారీ ఎక్కడ నుంచి వస్తుంది” ”సిద్ధిపేట వైపు నుంచి” ”మృతుడు ఎటు వెళ్తున్నాడు.” ”కరీంనగర్‌వైపు” ”దేనిపైన వెళ్తున్నాడు” ”సైకిల్‌ పైన” ”అతనిది ఏ ఊరు” ”తెలియదు., ఏం పేరు, తెలియదు, అతను ఎవరో, ఏ ఊరో తెలియకే హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళావా..?
ఏం చెప్పాలో తోచలేదు. అవునని చెప్పాను. ”ఎంతవరకు చదువుకొన్నావు.
”ఇంటర్మీడియెట్‌” ”ఫిర్యాదు నువ్వే ఇచ్చావా”
”అవును” ”నువ్వే రాశావా”
”లేదు” ”ఎవరు రాశారు” ………..తెలియదా..?
రెట్టించాడు. ”తెలుసు”
”స్టేషన్లో ఎవరో వ్రాశారు”
”చదువుకొన్నవాడివి కదా!
నువ్వెందుకు రాసి ఇవ్వలేదు. ”………………….”
”పోలీస్‌స్టేషన్లో తెల్లకాగితాల మీద సంతకాలు చేశావు”
ఏం చెప్పాలో తోచలేదు.
ఏం చెబితో ఏమవుతుందోననిపించింది. గొంతులో తడి ఆరిపోయింది. కాస్సేపటికి
”కాదు” సమాధానం చెప్పాను.
”ఆరోజు స్కూటర్‌ మీద వెళ్తున్నావు”
”లేదు” ”నీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు” ముచ్చెమటలు పోస్తున్నాయి. ”నీకు స్కూటరుంది. నీకు డ్రైవింగ్‌ సరిగ్గా రాకపోవడం వల్ల అడ్డదిడ్డంగా స్కూటర్‌ నడిపి మృతున్ని సైకిల్‌కి టక్కర్‌ ఇచ్చావు. ఆ తాకిడికి అతను ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. అప్పుడే అక్కడికి వచ్చిన లారీ డ్రైవర్‌ అది చూసి తన లారీని ఆపాడు.గుండె గతుక్కుమంది. గొంతు ఎండిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఎపీపీవైపు చూశాను. కోర్టు వైపు చూశాను. మిగతా న్యాయవాదుల వైపు చూశాను. అంతా హాయిగా ఉన్నారు. నన్ను చూసి ఎంజాయ్‌ చేస్తున్నట్లు అనిపించింది.
”ఏమంటావు..?” రెట్టించాడు ”అబద్ధం, అబద్ధం, గట్టిగా అరిచాను. అందరూ నావైపు వింతగా చూశారు. అటెండర్‌ కోపంగా నా వైపు చూశాడు. గిల్టీగా ఫీలయ్యాను. ”నీకు పోలీసుల తో సన్నిహిత సంబంధాలున్నాయి” ”అబద్ధం”
”నీ నిర్లక్ష్యం వల్లే యాక్సిడెంట్‌ జరిగింది. దాన్నించి తప్పించు కోవడం కోసం పోలీసులతో కుమ్మక్కై ఈ ముద్దాయిపై తప్పుడు కేసు పెట్టించావు.
”అబద్ధం” ఇలాంటివే ఇంకా చాలా ప్రశ్నలు అడిగాడు అన్నింటికీ అబద్ధం చెప్పడం మినహా ఏమీ చెయ్యలేకపోయ్యాను. కురుసభలో ద్రౌపదిలా అయిపోయింది. నా పరిస్థితి నన్ను ఆదుకోవడానికి ఎవరూ లేరు. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ అయిపోయేసరికి అలిసిపోయ్యా ను. బీపీ పెరిగిపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. వాంగ్మూలంపై సంతకం పెట్టి బోనులోంచి బయటపడ్డాను. మరేదో ఉచ్చులో బిగుసుకొన్నానని భయమేసింది.
ఏం చెయ్యాలో తోచలేదు. ఏపీపీ కోసం కోర్టు హాలు బయట వెయిట్‌ చేస్తూ నిల్చున్నాను. రెండు గంటల ప్రాంతంలో అతను బయటికి వచ్చాడు. అదుర్దాగా అతని దగ్గరికి వెళ్ళాను. నాకేమైనా చుట్టుకుంటుందా సార్‌ భయం భయంగా అడిగాను. ”ఏం కాదులే నవ్వుతూ జవాబిస్తూ స్కూటర్‌ స్టాండ్‌వైపు వెళ్ళిపోయ్యాడు. కానిస్టేబుల్‌ కన్పిస్తే అతని వద్దకి కూడా వెళ్ళి అడిగాను. అతనూ అలాగే సమాధానం చెప్పాడే. సైకిల్‌ తీసుకొని కోర్టు నుంచి బయటకొచ్చాను. భారంగా ఉంది. ఏదో కోల్పోయినట్టుగా ఉంది. ఎంతటి దుర్గతి. ఎంత మనోవ్యధ, ఏమీ కాదంటారు వీళ్ళు ఎటు తిరిగి ఎటు వస్తుందో. ఏదో ఉచ్చు బిగుస్తున్నట్టు అనిపించింది. ఏదో ఊబిలోకి కూరుకుపోతున్నాని అన్పించింది. భయం భయంగా ఇంటిదారి పట్టాను. వీటన్నింటికీ కారణం నా రెండో పాత్ర నా రెండో పాత్ర మీద కోపం ముంచుకొచ్చింది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండటానికి నా రెండో పాత్రని హత్య చెయ్యాల నుకొన్నాను. దగ్గర్లో ఉన్న ఓ షాపుకు వెళ్ళి ఓ కత్తి కొనుకొన్నాను.