‘హద్దు’ మీరుతున్న చైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) :
చైనా ‘హద్దు’ మీరుతూనే ఉంది. చైనా సైన్యం ఇటీవల భారత భూభాగంలోకి పది కిలోమీటర్లమేర చొచ్చుకురావడంపై ఇరుదేశాల సైన్యాలకు చెందిన బ్రిగేడియర్‌ స్థాయి ఉన్నతాధికారులు మంగళవారం లడాఖ్‌ ప్రాంతంలో సమావేశమై జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. చొరబాటుకు ముందున్న స్థితిని అనుసరించాలని భారత సైన్యం కోరినప్పటికీ దానికి చైనా అంగీకరించలేదు. తమది చొరబాటు కాదని, అది తమ ప్రాంతమేనని చైనా సైనికాధికారులు వాదించారు. దీంతో చొరబాటు ప్రాంతానికి ఒక సైనిక పటాలన్ని పంపాలని రక్షణశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు ఇరుదేశాల సైనికాధికారులమధ్య మూడు గంటలపాటు చర్చలు జరిగాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ మంగళవారం ఢిల్లీలో చెప్పారు. భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉందని అన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రశాంతంగా పరిషారమయ్యాయని, ఈసారికూడా అదేవిదంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15,16 తేదీలలో చైనా సైన్యం చొరబాటును గమనించాయని, 18వ తేదీన ఇరుసైన్యాల ఉన్నతాధికారులమధ్య ఈ విషయంపై ఫ్లాగ్‌ మీటింగ్‌ జరిగిందని వెల్లడించారు. అదేరోజున విదేశాంగశాఖ కార్యదర్శి భారత ప్రభుత్వ ఆందోళనను ఢిల్లీలోని చైనా రాయడారికి తెలియజేశారని సయ్యద్‌ అక్బరుద్దీన్‌ చెప్పారు