హమ్మయ్యా! ఈ ఏటికి ‘నీట్‌’ లేదు

సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) :
రాష్ట్ర విద్యార్థులకు ఈ ఏటికి నీట్‌ గండం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మాదిరే మెడికల్‌ అడ్మిషన్లు జరుపవచ్చంటూ సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఎంసెట్‌ ద్వారానే వైద్యవిద్య కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈసారి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. ఈ వెసులుబాటు ఈ విద్యాసంవత్సరానికి మాత్రమేనని జస్టిస్‌ ఆల్తామస్‌ కబీర్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. వైద్య విద్య ప్రవేశాలను, ఫలితాలను నిలిపివేస్తూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. 2013-14 విద్యా సంవత్సారానికి గాను రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య విద్య కళాశాలల్లో ఎంసెట్‌ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతించింది. అలాగే, జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడించవచ్చని భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)ని ఆదేశించింది. నీట్‌ కొనసాగింపుపై దాఖలైన పిటిషన్లను విచారించిన రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ వైద్య విద్య సంస్థలు, ఎంసీఐ నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు వెల్లడించొద్దని గత డిసెంబర్‌ 13న నిషేధం విధించింది. ఆయా పిటిషన్లపై ఇటీవలే తుది విచారణ నిర్వహించిన ధర్మాసనం జూలై 2న తుది తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది.సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు ఎంతో ఊరట లభించినట్లైంది. ఎంసెట్‌ ఫలితాలు వెల్లడితో పాటు రాష్ట్ర స్థాయిలోనే వైద్య విద్య కళాశాలల్లోకి ప్రవేశాలను నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఏడాది ఎంసెట్‌ ఫలితాల ఆధారంగానే మెడిసిన్‌, డెంటల్‌ సీట్లు భర్తీ చేయనున్నారు. విద్యార్తుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవల నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షకు మెడిసిన్‌ విభాగంలో 1.04 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, కొంతకాలంగా నీట్‌, ఎంసెట్‌ వివాదంపై విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. నిజానికి ఈ కేసులో తుది తీర్పును జూలై 2న ప్రకటిస్తామని సుప్రీంకోర్టు తుది విచారణ సందర్భంగా ప్రకటించినప్పటికీ, మెడిసిన్‌ ప్రవేశాల్లో జాప్యం అవుతుందని కొన్ని రాష్టాల్రు అభ్యంతరాలు తెలపడంతో.. న్యాయస్థానం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.వైద్యరంగంలో ప్రమాణాలు నెలకొల్పేందుకు, వైద్యవిద్యలోకి ప్రవేశాలను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)ను నిర్వహించాలని యోచించింది. రాష్టాల్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఎంసెట్‌ను తొలగించి, దేశవ్యాప్తంగా ఒకే విధానం ద్వారా మెడిసిన్‌ ప్రవేశాలు చేపట్టాలని నీట్‌ను తెరపైకి తీసుకువచ్చింది. ఈ ఏడాది నుంచే దాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అయితే, దీనిపై రాష్టాల్ర నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పలు రాష్టాల్రు, విశ్వవిద్యాలయాలు మొత్తం 92 పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో న్యాయస్థానం గతేడాది డిసెంబర్‌లో మెడిసిన్‌ ప్రవేశాలు ఫలితాలపై స్టే విధించింది. ఇటీవలే విచారణ పూర్తి చేసిన ధర్మాసనం తుది తీర్పును జూలై 2కు రిజర్వ్‌ చేసింది. అయితే, ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమవుతుందన్న రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే వైద్య విద్య ప్రవేశాలు నిర్వహించవచ్చని ఆదేశించింది. విద్య విద్యార్థుల భవిష్యత్తును, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ఉత్తర్వులు జారీ  చేస్తున్నామని పేర్కొంది. ఈ ఏడాదికి నియమ నిబంధనలు పూర్తి చేసిన తర్వాతే తీర్పు వెలువరిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఎంసీఐ, వివిధ రాష్టాల్రు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎంసెట్‌ ద్వారా ప్రవేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.