హరితహారం విజయవంతం చేయండి: కలెక్టర్‌

 భద్రాద్రి కొత్తగూడెం,మే26(జ‌నం సాక్షి): అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టుదలతో పనిచేసి హరితహారాన్ని విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు కోరారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దని.. ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగో విడత హరితహారంపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు. జూన్‌ నుంచి వర్షాకాలం ప్రారంభం కానున్నందున రైతులు మొక్కలు నాటేందుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇదిలావుంటే  వానకాలం పంటల సాగు కోసం తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ అధికారులు అవసరమైన మేర విత్తనాలు సిద్ధం చేశారు.  ఎంతమేర విత్తనాలు అవసరం ఉంటాయో మండల వ్యవసాయశాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. దానికి అనుగుణంగా ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు టీ సీడ్స్‌ కార్పొరేషన్‌కు ఇండెంట్‌ పంపించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 9,329 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటుందని  జిల్లావ్యవసాయశాఖ అధికారులు నిర్ధారించారు. వేరుశనగ 83 క్వింటాళ్లు, వరి వివిధ రకాలు కలిపి 6,100 క్వింటాళ్లు, కంది 227 క్వింటాళ్లు, పెసర 283 క్వింటాళ్లు, మినుములు 60 క్వింటాళ్లకు అంచనా వేశారు. పచ్చి రొట్ట విత్తనాలు అయిన దయించ 2,376 క్వింటాళ్లు, పిల్లిపెసర 1,150 క్వింటాళ్లు, జనుము మరో 200 క్వింటాళ్లు అవసరం వుంటుందని నిర్ధారణకు వచ్చారు. ఇయితే ఇప్పటికే అందుకు అనుగుణంగా దాదాపు 5,653 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేసిన అధికారులు మరి కొద్ది రోజుల్లోనే సొసైటీలకు చేరవేయనున్నారు.