హరీశ్‌రావు అరెస్ట్‌

` ఆయతోపాటు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
` గచ్చిబౌలి పీఎస్‌కు తరలింపు
` ఇది ప్రజాస్వామ్య పాలన రాక్షస పాలన..!
ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు
` ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు
హైదరాబాద్‌(జనంసాక్షి):మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు హరీష్‌ రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంజారాహిల్స్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని గచ్చిబౌలికి తరలించారు. హరీష్‌ రావును ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై హరీష్‌రావుపై కేసు నమోదైంది. పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన సమయంలో అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. పోలీసులు వాహనంలోకి ఎక్కే ముందు హరీష్‌ రావు తీవ్రంగా ప్రతిఘటించారు. బంజారాహిల్స్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేరుకుంటున్నారు. హ?రీశ్‌ రావుతో పాటు ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు హరీశ్‌ రావు అరెస్ట్‌ సందర్భంగా కౌశిక్‌ రెడ్డి ఇంటిని పోలీసులు ధ్వంసం చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు అరెస్టును నిరసిస్తూ సిద్దిపేటలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు.. సీఎం రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్‌రావును వెంటనే విడుదల చేయాలని కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.ఇక కౌశిక్‌ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన హరీశ్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు.. రాక్షస పాలన అని ధ్వజమెత్తారు. ఈ మేరకు హరీశ్‌రావు ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని నిలదీశారు హరీశ్‌రావు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నాపై, బీఆర్‌ఎస్‌ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది అని రేవంత్‌ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాగా ఏడాది పాలన సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన తప్పులపై బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లనకు తరలిస్తున్నారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు.