హామీలు మరిచారు

6

తెరాసను ఓడించండి:ఉత్తమ్‌

జగదీశ్‌ స్థాయిని మించి మాట్లాడొద్దు:జానా

హైదరాబాద్‌,మార్చి16(జనంసాక్షి): గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో తెరాసను ఓడించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించేలా నేతలు కృషి చేయాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సిఎల్పీ నేత జానారెడ్డి, మండలిలో విపక్షనేత డీ శ్రీనివాస్‌ సూచించారు. ఇచ్చిన హవిూల అమలు విషయంలో కేంద్రంలో నరేంద్రమోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విఫలమయ్యారని వారు విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను పట్టభద్రులు గ్రహించి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేయాలని కోరారు. గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ హై కమాండ్‌ ఆదేశం మేరకే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నామని, ప్రచారం కూడా ఆలస్యంగా ప్రారంభించామని చెప్పారు. విదేశాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని తెప్పించడంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి తెప్పిస్తామని బీజేపీ గొప్పలు చెప్పుకుందని దుయ్యబట్టారు. నల్ల ధనాన్ని రప్పించి ప్రతీ పౌరుడికి రూ.15 లక్షలు పంచుతామని గొప్పలు చెప్పుకున్నారని కానీ ఇప్పటి వరకు 15 పైసలు కూడా పంచలేదని ధ్వజమెత్తారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి అవినీతికి సంబంధించి తమ పార్టీ నేత పొన్నం ప్రభాకర్‌ నుంచి పూర్తి సమాచారం తీసుకుంటున్నామని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు.

కాగా మంత్రి జగదీశ్‌ రెడ్డి చెల్లని రూపాయి అని, ఆయన సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నారని జానారెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పన్షన్ను ఎత్తివేసి సభకు రప్పించడం సబబుగా ఉంటుందని చెప్పారు.  తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ఆయన గురించి మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోనని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.  జగదీశ్‌రెడ్డిని చెల్లని రూపాయి అని, కుసంస్కారి అని పేర్కొన్నారు. అన్నివర్గాల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం నీరుగార్చిందని మరో నేత డీఎస్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని డీఎస్‌ పిలుపునిచ్చారు. ఇదిలావుంటే  విపక్ష నేత జానారెడ్డితో టీ.టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి సమావేశయ్యారు. ఈ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంపై చర్చించారు. ఈ అంశంపై రాష్ట్రపతికి, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నట్లు జానారెడ్డికి వారు వివరించారు. అధికారపక్షం దుర్మార్గంగా వ్యవహిస్తూ.. తమను సస్పెండ్‌ చేయడంపై సభలో ప్రతిపక్ష నేత ప్రశ్నించకపోవడం సరికాదని అన్నారు. రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టాలని, తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు ప్రతిపక్ష నేతగా చొరవచూపాలని టీడీపీ నేతలు జానారెడ్డిని కోరారు. నేడు తమకు ఎదురైన పరిస్థితే.. భవిష్యత్తులో అందరికీ ఎదురయ్యే ప్రమాదముందని వారు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇదిలావుంటే మంగళవారం నగరంలోని గాంధీభవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్‌లో ప్రచారం చేశామన్నారు. దిల్లీలో భాజపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ నెల 18న ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తామని, 6 జిల్లాల్లోని 72 నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహరచన చేస్తామన్నారు.