హామీల ప్రతిబింబంగా తొలి బడ్జెట్
పన్నులు లేవు
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల
ప్రణాళిక వ్యయం రూ. 52,383కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ. 63,306కోట్లు
రెవెన్యూ మిగులు రూ. 531కోట్లు
ద్రవ్యలోటు రూ.16,969 కోట్లు
కేంద్ర పన్నుల వాటా రూ.12,823 కోట్లు
హైదరాబాద్ – వరంగల్ మధ్య ఇండస్టియ్రల్ కారిడార్
ముచ్చెర్లలో 11 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ
హైదరాబాద్,మార్చి11(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరవాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు స్పష్టమయ్యింది. ఇప్పటివరకు చేపట్టిన కార్యాక్రమాలు, భవిష్యత్‌లో చేయబోయే పనుల సమ్మిళతంగా బడ్జెట్ రూపొందడం విశేషం. తెలంగాణలోని ప్రతి పైసా.. సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగిస్తామని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సభలో తెలిపారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బడ్జెట్ అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులు మళ్లింపునకు గురయ్యాయి. ఇక్కడి ప్రజల చెమట చుక్క ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేస్తాం. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈటెల ప్రకటించారు. గతేడాది పదినెలల కాలనికి ప్రస్తుతం రెండోసారి ఈటెల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని తనఅదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బడ్జెట్ అంటే జీవం లేని అంకెలు కాదు..తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అని అభివర్ణించారు. తెలంగాణను ఆశించిన స్థాయిలో ముందుకు నడిపిస్తామన్నారు. అమరవీరులకు జోహార్లు పలుకుతున్నట్లు ప్రకటించారు. గుజరాజ్, తెలంగాణలది మిగులు బడ్జెట్ అని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఉద్ఘాటించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా, మేడిన్ తెలంగాణ నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.1,15,689 కోట్లు అని ఆర్థిక మంత్రి ఈటెల తెలిపారు. ఆర్థిక మిగులు రూ. 531 కోట్లుగా చూపిస్తూ ప్రణాళిక వ్యయం రూ. 52 వేల 383 కోట్లుగా,ప్రణాళికేతర వ్యయం రూ. 63 వేల 306 కోట్లుగా ద్రవ్యలోటు రూ. 16,969 కోట్లుగా బడ్జెట స్వరూపాన్ని స్థూలంగా ఆవిష్కరించారు. ప్రజధనాన్ని బాధ్యతాయుతంగా ఖర్చుపెట్టే పక్రియ బడ్జెట్ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 481 మంది అమరుల కుటుంబాలకు రూ.48.12 కోట్ల సాయం అందించామని వెల్లడించారు. ఇక వ్యవసాయం, వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, విద్యుత్ రంగాలకు పెద్దపీట వేశారు. ఈ రంగాలకు నిధుల కేటాయంపు కూడా భారీగానే పెంచారు.
కేంద్ర నిధులు తగ్గాయి
కేంద్రం నుంచి రాష్టాన్రికి రావాల్సిన నిధులు బాగా తగ్గాయని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
పేర్కొన్నారు. శాసనసభలో 2015-16 బడ్జెట్‌ను మంత్రి చదివి వినిపించారు. కేంద్రం నుంచి నిధులు అంది ఉంటే రాష్ట్ర ఆదాయ వ్యయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగేవాళ్లమని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో 2014-15 సంవత్సరానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళికా సహాయం రూ.11,781 కోట్లు. కానీ 2015 ఫిబ్రవరి వరకు కేవలం 4,147 కోట్లు మాత్రమే సహాయం అందిందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అందాల్సిన ప్రణాళికేతర గ్రాంట్లు రూ. 9,939 కోట్లు. కానీ 2015 ఫిబ్రవరి నెల వరకు కేవలం రూ. 1,346 కోట్లు అందాయని పేర్కొన్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్(ఎఫ్‌ఆర్‌బీఎమ్) చట్టం కింద కొంతమేర అప్పు తెచ్చుకునే అవకాశం రాష్టాల్రకు ఉంటుందన్నారు. అలా అప్పు తెచ్చుకునే పరిమితిని సడలించి మరో రూ. 4,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు రాష్టాన్రికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. దీనిపై ఇంత వరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రణాళిక, ప్రణాళికేతర నిధుల్లో తరుగు, సీఎస్‌టీ పరిహారం మరియు ప్రత్యేక ఆర్థిక సహాయం రాకపోవడం, రుణ పరిమితి పెంపును సడలించకపోవడం వంటివి అన్ని కలిపితే తమ ఆదాయ వనరుల్లో రూ. 20,227 కోట్లు లోటు ఏర్పడుతున్నదని పేర్కొన్నారు. ఈ లోటుకు కారణమైన అంశాలేవీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివి కావు అని స్పష్టం చేశారు.
ఇరగేషన్‌కు అత్యంత ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో కలిపి ఇతర సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ రూ. 8,500 కోట్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లే గోదావరి, కృష్ణా నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం, నక్కలగండి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులు చేపట్టాలని బడ్జెట్‌లో కొత్తగా ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్‌కు తాగునీరు అందించడమే కాకుండా, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాల భూములకు సాగు నీరు అందిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాలమూరు ఎత్తిపోతల పథకానికి పాలనాపరమైన అనుమతిని కూడా ఇచ్చేశామని గుర్తు చేశారు. ఇక నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు 3 లక్షల 40 వేల ఎకరాల భూమికి నక్కలగండి ప్రాజెక్టు ద్వారా తాగు మరియు సాగునీరు అందుతుందన్నారు. వర్షకాలంలో 51 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే విధంగా రెండు రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఒకటి తడకపల్లిలో రెండవది పాములపర్తిలో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలో వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్‌కు రూ. 200 కోట్లు, చిన్ననీటి పారుదలకు రూ. 200 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వాటర్ గ్రిడ్,కాకతీయ మిషన్ లు రెంటికి కలిపి ఆరు వేల కోట్లు కేటాయించారు. ముఖ్యంగా ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్ చేసి మరీ చెబుతున్నారు.లేకుంటే తాము మళ్లీ ఎన్నికలలో ఓట్లు అడగబోమని అంటున్నారు.అలాంటి స్కీమ్ కు ఇరవై ఏడువేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా .దానికి ఇతరత్రా నిధులు ,అప్పులు ఎలా వస్తాయో తెలియదు కాని, బడ్జెట్ లో మాత్రం నాలుగువేల కోట్ల రూపాయలే కేటాయించారు. అలాగే సాగునీటికి,కాకతీయ మిషన్ కు కలిపి ఎనిమిది వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల ఎంతవరకు చెరువుల పని పూర్తి అవుతుందోచెప్పలేం. సుమారు ఇరవై రెండువేల కోట్ల వ్యయం అంచనా వేశారు.
వ్యయంతో కూడుకున్నది వ్యవసాయం
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 8,432 కోట్లు ప్రతిపాదిస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. తెలంగాణలో వ్యవసాయం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువ అని తెలిపారు. దీని వల్ల వ్యవసాయ రంగం పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నదని చెప్పారు. వర్షపాతంలో అనిశ్చితి, భూగర్భ జలాల తరుగుదల, నీటి పారుదలలో సౌకర్యాల లేమి, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగాన్ని ఎదగనివ్వడం లేదన్నారు. పరిస్థితులను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేశారు. డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది.
మార్కెటింగ్‌లో సంస్కరణలు
వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో సంస్కరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లో ఈ మార్కెటింగ్ వేలం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధి అవసరమని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. పాలమూరు ఎత్తిపోతల, నక్కలగండి ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ముచ్చర్లలో 11వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పాలమూరు, నక్కలగండి ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు. తడకపల్లి, పాములపర్తిలో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. 108 వాహనాల సంఖ్యను 335 నుంచి 603కు పెంచుతామన్నారు. 104 సేవలను మెరుగుపరుస్తామన్నారు. మేధో మథనం తర్వాత కేజీ టు పీజీ విద్య కార్యక్రమం చేపడతామని తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చుపెట్టామని, మరో రూ. వంద కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల వెల్లడించారు. యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధికి సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద యువతుల వివాహం కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర విద్యుత్ రంగం పునరుద్దరణకు తొలి అడుగులు వేస్తున్నామని, మరో రూ.4 వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఈటెల వెల్లడించారు. 2018కల్లా తెలంగాణలో మిగులు విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈటెల తెలిపారు.
అంగన్‌వాడీలకు జీతాల పెంపు
రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల జీతాన్ని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తల నెల జీతాన్ని రూ. 4,200 నుంచి రూ. 7,000లకు, సహాయకులకు రూ. 2,450 నుంచి రూ. 4,500 పెంతున్నట్లు తెలిపారు. పెంచిన జీతాలు మార్చి 2015 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. వంటపాత్రల కొనుగోలుకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి రూ. 1,000 చొప్పున వన్‌టైమ్ గ్రాంటుగా ఇవ్వాలని కూడా 2015-16 బడ్జెట్‌లో ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. మహిళా, శిశు సంక్షేమంలో, ఆరోగ్యంలో కీలక పాత్ర వహించే అంగన్‌వాడీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా భావించవచ్చని పేర్కొన్నారు.
హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం
రాష్ట్రంలోని హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాసనసభలో 2015-16 బడ్జెట్‌ను మంత్రి చదివి వినిపిస్తున్నారు. హాస్టళ్లకు రూ. 2200 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. సన్న బియ్యంతో భోజనం పెడుతున్నందుకు స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ తగ్గినయి అని స్పష్టం చేశారు. చదువుకునే పిల్లలు కడుపునిండా అన్నం తినాలనే ఉద్దేశంతోనే సన్న బియ్యం పథకం అమలు చేశామని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్లకు నిధుల పెంపు
పోలీస్ స్టేషన్ లలో అవినీతిని తగ్గించే కృషిలో భాగం గా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ స్టేషన్ లకు నిర్వహణ వ్యయం నిధులు గణనీయంగా పెంచింది.ప్రజలు ఎవరు ఫిర్యాదు చేయడానికి వచ్చినా,వారి నుంచి కాగితం కోసమనో,మరో దానికి అనో పోలీసులు డబ్బులు వసూలు చేస్తుంటారు.వాటిని లేకుండా చేయడం కోసం హైదరాబాద్ నగరంలో పోలీస్ స్టేషన్ లకు ఒక్కొక్కదానికి డెబ్బైఐదు వేల రూపాయల చొప్పున ,పట్టణాలలో ఏభై వేల రూపాయల చొప్పున,గ్రామాలలో పోలీస్ స్టేషన్ లకు పాతికవేల రూపాయల చొప్పున నిధులు కేటాయింపు చేస్తున్నట్లు ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తనబడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తామని తెలిపారు. సిటీ పోలీస్ స్టేషన్లకు నెలకు రూ.75వేలు, గ్రావిూణ పోలీస్ స్టేషన్లకు నెలకు రూ.25వేలు ఇవ్వనున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వం సేఫ్ సిటీ కార్యక్రమం క్రింద లక్ష సీసీ కెమెరాలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కెమెరాలన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం అయి ఉంటాయని పేర్కొన్నారు. ఎక్కడా ఏం జరుగుతుందో ఈజీగా తెలిసిపోతుందని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి 38 రకాల జరిమానాలను చెల్లించడానికి ఈ -చలానా విధానాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ విధానాన్ని వాహనదారులు స్వాగతించారని వెల్లడించారు. మరోవైపు పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలపై రూపాయి కూడా పన్ను వేసేది లేదని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే 2015-16 బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో విస్మరించిన రంగాలపై తాము దృష్టి పెట్టి బడ్జెట్‌ను తయారు చేశామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం, పథకాలు చూసి బడ్జెట్ తయారీ జరిగిందన్నారు. గృహ నిర్మాణానికి బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కేజీ టు పీజీ విద్యకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని స్పష్టం చేశారు. ఈ పథకానికి ఆదరాబాదరాగా నిధులు ఇవ్వాలని అనుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 16,272 కాగా, తలసరి ఖర్చు రూ. 16,042 అని మంత్రి తెలిపారు. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది.
స్థూలంగా వివిధ రంగాలకు కేటాయింపులు
యాదగిరి గుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్లు.
మిషన్ కాకతీయకు రూ. 2083 కోట్లు.
నీటిపారుదలశాఖకు రూ. 6,417 కోట్లు
జంటనగరాల్లో తాగు నీటికి రూ. 1000 కోట్లు.
తాగునీటికి రూ. 8500 కోట్లు.
అటవీ, పర్యావరణ శాఖకు రూ. 325 కోట్లు.
విద్యుత్ శాఖకు రూ. 7,400 కోట్లు.
పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకాల కోసం రూ. 974 కోట్లు.
విద్యారంగానికి రూ. 11,216 కోట్లు.
వాటర్‌గ్రిడ్‌కు రూ. 4000 కోట్లు.
రోడ్ల అభివృద్ధికి రూ. 2421 కోట్లు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు 771 కోట్లు.
ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు రూ. 22,889 కోట్లు.
బీడీ కార్మికులకు రూ. 188 కోట్లు.
మైనార్టీలకు రూ. 1,165 కోట్లు.
బీసీలకు రూ. 2,172 కోట్లు.
పశు, ఉద్యానవన, వ్యవసాయ వర్సిటీలకు రూ. 261 కోట్లు.
ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి రూ. 238 కోట్లు
హరిత హారానికి రూ. 325 కోట్లు
ఎస్సీ, ఎస్టీల భూముల కొనుగోలుకు రూ. 1000 కోట్లు
ఆర్టీసీ కొత్త బస్సుల కోసం రూ. 400 కోట్లు.
హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లకు రూ. 1600 కోట్లు
ఆహార భద్రత, సబ్సిడీ రూ. 2,200 కోట్లు
అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ. 7 వేలు. కార్యకర్తలకు రూ. 4,500. హాస్టళ్లకు రూ. 2200 కోట్లు,
గిడ్డంగులు రూ. 403 కోట్లు, మార్కెటింగ్ శాఖకు రూ. 411 కోట్లు
చిన్ననీటి పారుదలకు రూ. 200 కోట్లు
పంచాయతీరాజ్ శాఖకు రూ. 2421 కోట్లు
ఆసరా పెన్షన్ల కోసం రూ. 4 వేల కోట్లు.
మెట్రో రైల్‌కు రూ.416కోట్లు కేటాయింపు జీహెచ్‌ఎంసీకి రూ.526కోట్లు
ఎస్సీ సంక్షేమానికి రూ. 5,547 కోట్లు
గిరిజన సంక్షేమానికి రూ. 2,878 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 2,172 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ. 1,105 కోట్లు