హిందీ పండితునికి సన్మానం
ఒంగోలు, మార్కాపురంటౌన్ ,జూన్ 30 : స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హింది పండితునిగా పనిచేయుచున్న టి హనుమంతరావు పదవీవిరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై సత్యనారాయణరెడ్డి అద్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఇవో సిహెచ్పి వెంకటరెడ్డి మాట్లాడుతూ హనుమంతరావు పనిచేసిన పాఠశాలల్లో భౌతిక అభివృద్ధి, విద్యాభివృద్ధికోసం ఎంతో సేవలు అందించారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అతిథిగా హాజరై మాట్లాడుతూ హింది పండితుడు హనుమంతరావు మార్కాపురం ప్రాంతంలో విస్తృతంగా తమ సేవలను అందించి ఉపాధ్యాయునిగా విద్యాసేవాకార్యక్రమాలే కాక సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొనేవారని ఆయన సేవలను శ్లాఘించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 27 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులను ఆయన తీర్చిదిద్దారని హిందీ భాషాభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని తమదైన శైలిలో విశిష్ట సేవలు అందించారని అభినందించారు. అనంతరం ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూర్వ విద్యార్థులు బంధు మిత్రులు ఆయనను ఘనంగా సన్మానించారు.