హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌: నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళ్తే.. ఆ జీవోను రద్దు చేసి హైడ్రాను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హైడ్రాను అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తిగత కక్షలతో ఆరోపణలు చేస్తున్నారని, వాటి ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదంది. కేవలం పత్రాలను చూసి హక్కులను ఎలా తేలుస్తారని, హక్కులను నిర్ణయించే అధికారం ఆ సంస్థకు ఎక్కడుందని నిలదీసింది. నోటీసులు జారీ చేసి.. వివరణ ఇచ్చేందుకు తగిన గడువు ఇచ్చి.. చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా అని ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలో తన స్థలానికి సంబంధించి సమర్పించిన వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చివేశారని పేర్కొంటూ హైకోర్టులో ఎ.ప్రవీణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ గురువారం విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ గాయత్రి మెంబర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టిందని తెలిపారు.

నిర్మాణాలకు 2023 నవంబరు 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని, తర్వాత ఆ అనుమతులను రద్దు చేస్తూ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే హైడ్రా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రహదారులకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని ‘బుల్డోజర్‌ కేసు’లో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన ప్రక్రియ ద్వారా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ.. తాను 20కి పైగా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశానని, అయినా పిటిషన్లు వస్తూనే ఉన్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శిని బెదిరించి అనుమతులు తీసుకున్నారని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. 2023లో అనుమతులు మంజూరు చేస్తే 2025లో ఎలా రద్దు చేస్తారని, ఇన్నేళ్లు ఏం చేశారని నిలదీశారు. గత విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులను ఎందుకు సమర్పించలేదన్నారు. పార్కు స్థలాన్ని కబ్జా చేశారని గాయత్రి మెంబర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టామంటున్నారని, అదే అసోసియేషన్‌ హైడ్రా రాకముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.

పార్కు ఆక్రమణ జరుగుతోంటే ఎందుకు మౌనంగా ఉందని అడిగారు. ప్రస్తుతం హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి కాల్చుతున్నారని వ్యాఖ్యానించారు. పార్కు స్థలమన్నది నిర్ణయించడానికి మీరెవరని, హక్కులను నిర్ణయించాల్సింది సివిల్‌ కోర్టు అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. లేఔట్‌కు అనుమతులను సర్పంచ్‌ మంజూరు చేశారని, ఆ అధికారం సర్పంచ్‌కు ఎక్కడుందన్నారు. పిటిషనర్‌ను కబ్జాదారుగా ఎలా పేర్కొంటారని హైడ్రా ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ను నిలదీశారు. కబ్జాదారుగా నిర్ణయించడానికి మీరెవరన్నారు. తాను పిటిషనర్‌ను సమర్థించడం లేదని, అధికారులు చట్టప్రకారం ముందుకెళ్లడం లేదన్నదే తన ఆవేదన అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం పిటిషనర్‌కు చెందిన స్థలంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశిస్తూ విచారణను మార్చి 5కి వాయిదా వేశారు.