హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి

అఖిలపక్షంతో రాష్ట్రపతిని కలుస్తాం : కోదండరామ్‌

న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి) :

హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రమే కావాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసమే తాము తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామని తెలిపారు. తామేమీ దేశం నుంచి విడిపోతామని చెప్పడం లేదని, కేవలం స్వయం పాలన కోరుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కల్లబొల్లి మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని నిప్పులు చెరిగారు. ఇంకెంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటకు, డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. టీ-జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌, జనతా పార్టీ, సోషలిస్టు, బోడో ల్యాండ్‌, జేఎఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఆర్‌ఎల్డీ, సీపీఎం న్యూడెమోక్రసీ, ప్యాంతర్స్‌ పార్టీకి చెందిన నేతలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం సందర్భంగా కోదండరాం ప్రసంగిస్తూ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయమే జరిగిందని, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు దోపిడీకి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల్లోనూ, నీటి పంపకాల్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. సమైక్య రాష్ట్రంలో సీమాంధ్రులు అన్ని ఒప్పందాలు, నిబంధనలు ఉల్లంఘించారన్నారు. ముల్కీ నిబంధనలు మొదలు పెద్ద మనుషుల ఒప్పందం వరకూ అన్నింటిని తుంగలో తొక్కారన్నారు. చివరకు తెలంగాణపై నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యలను కూడా వక్రీకరించారని మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంతంలో రెవెన్యూ రాబడి తక్కువ అని, కానీ నిధుల కేటాయింపు మాత్రం ఎక్కువగా అక్కడే ఉందన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకపోవడానికి వెనుకబాటుతనంతో పాటు రాజకీయ బలం లేకపోవడమేనన్నారు. తెలంగాణ సమస్య రాజకీయ సమస్య అని, రాజకీయంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఆంధ్ర ప్రాంత నాయకులు బలమైన కుటిలనీతి గల రాజకీయ వేత్తాలని, అందుకే రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్నారన్నారు. ఆత్మగౌరవం కోసం, సమానత్వం కోసమే తాము తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్ష నుంచి వచ్చిన ఉద్యమమన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మబలిదానాలపై కాంగ్రెస్‌, టీడీపీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీపై కోదండరాం నిప్పులు చెరిగారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ఇచ్చిన మాటన నిలబెట్టుకోలేక పోయిందని విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. తెలంగాణపై ఆ పార్టీ బహురకాలుగా మాట్లాడుతోందని విమర్శించారు. కల్లబొల్లి మాటలతో ఇంకేంత కాలం మోసగిస్తారని సూటిగా ప్రశ్నించారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై ప్రణబ్‌ ముఖర్జీ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫార్సుల్ని సైతం తుంగలో తొక్కారని మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ, రోశయ్య కమిటీ అంటూ కమిటీలు వేశారు గానీ నిర్ణయం ఎందుకు తీసుకోలేదన్నారు. ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలకు అనుమతి ఇవ్వడం కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. కొందరు జైతెలంగాణ అంటే, మరికొందరు నహీ తెలంగాణ అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పెద్ద బహిరంగ సభ పెట్టి తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారని, ఆ తర్వాత సీమాంధ్ర నేతలు కూడా బహిరంగ సభలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. సీమాంధ్ర నేతల సభలకు కూడా కాంగ్రెస్‌ పార్టీ అనుమతి ఇచ్చిందని, ఇది మోసపూరిత విధానం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాదని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. కాంగ్రెస్‌ ద్వంద్వ విధానాలు మాని స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం.. వెంటనే తెలంగాణ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్టాన్న్రి సాధించే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలంగా ఉన్న తెలంగాణ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఆలస్యమని తెలిపారు. సున్నితమైన తెలంగాణ అంశాన్ని మరింత కాలం నాన్చడడం సరికాదన్నారు. ఎంతోకాలంగా కొనసాగుతున్న ఉద్యమం ఇదని, తక్షణమే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు జాతీయ పార్టీల మద్దతు అవసరమని, సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి అందరూ కృషి చేయాలని విజ్ఞప్తిచేశారు. ఇకనైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో రాష్ట్రపతిని కలుస్తామన్నారు.