. హైదరాబాద్‌లో ఆకాశ మార్గాలు
ఎలివేటెడ్ కారిడార్లు, స్కై వేస్, మల్టీ లెవల్ గ్రేడ్ సపరేటర్స్
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్, డిసెంబర్ 19(జనంసాక్షి)-
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్లు, స్కై వేస్, మల్టీ లెవెల్ గ్రేడ్ సపరేటర్స్, నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన ప్రదేశాల ఎంపిక కోసం శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావుస రవాణా రంగ కన్సల్టెంట్లతో చర్చించారు. నగరంలో పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్ జాంలు అనివార్యమయ్యాయని, ప్రతి జంక్షన్‌లో చాలాసేపు ఎదురుచూడాల్సి వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి రద్దీ బాగా ఉండే ప్రధాన రహదారులపై స్కై వేస్, ప్రధాన జంక్షన్‌ల వద్ద మల్టీలెవల్ గ్రేడ్ సపరేటర్స్, జిల్లాల నుండి వచ్చే ట్రాఫిక్‌ను తట్టుకునేవిధంగా ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇదివరకే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కన్సల్టెంట్ల సహకారంతో అధికారులు ఆ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ముందుపెట్టారు. ఈ సందర్భంగా నగరంలో బాగా రద్దీగా ఉఞడే ప్రాంతాలను గుర్తించారు. నిత్యం ట్రాఫిక్ జాంలు జరిగే, ఎక్కువసేపు ఎదురుచూడాల్సివచ్చే జంక్షన్లను గుర్తించారు. అక్కడ ట్రాఫిక్ క్రమబద్దీకరశ్రీకు, సిగ్నల్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఎవరి దారిన వారు పోవడానికి వీలయ్యే మల్టీలెవల్ గ్రేడ్ సపరేటర్స్ నిర్మించడంపై చర్చించారు. హరిహర కళాభవన్ నుండి ఉప్పల్ వరకు, మాసబ్ ట్యాంక్ నుండి హరిహర కళాభవన్ వరకు, నాగార్జున సర్కిల్ నుండి మాదాపూర్ వరకు, తార్నాక నుండి ఈసీఐఎల్ క్రాస్‌రోడ్ వరకు, చార్మినార్ నుండి బీహెచ్‌ఈఎల్ వరకు.. ఇలా నగరంలో దాదాపు 11 స్కైవేలు నిర్మించాలని అధికారువలు ప్రతిపాదించారు. స్కై వేల నుండే రోడ్డు మారే ఏర్పాట్లు ఉండాలని, వాటికి అనుగుణంగా అండర్ వేలు నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు. నగరంలోని దాదాపు 35-40 జంక్షన్‌లలో ట్రాఫిక్ సమస్యను అధిగమించాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఒక్కసారి సిగ్నల్ పడితే వందలాది వాహనాలు ఆగిపోవాల్సి వస్తోందని చెప్పారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగునంగా జంక్షన్‌ల వద్ద ఆకాశంలోనే సపరేటర్స్ నిర్మించాలని చెప్పారు. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి ఉన్నాయని అన్నారు. ఎల్బీనగర్, ఉప్పల్, బంజారాహిల్స్ పార్క్ చుట్టూ, ఖైరతాబాద్, సెక్రటేరియట్, అంబెడ్కర్ సెంటర్, నెక్లస్ రోడ్‌కు వెళ్లే చౌరస్తా, అబిడ్స్, చాదర్‌ఘాట్, కోఠి, ఓవైసీ హాస్పిటల్స్, తిరుమలగిరి జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంగీత్, పారడైజ్ తదితర జంక్షన్‌ల వద్ద మల్టీలెవల్ గ్రేడ్ సపరేటర్స్ అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎక్కడైనా మెటో రైలు అడ్డుగా వస్తే దానిపై నుండి మార్గం నిర్మించాలని కూడా ప్రతిపాదించారు. వీటికి సంబంధించి డిజైన్‌లు, ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.