హైదరాబాద్ ముందు సింగపూర్ బలాదూర్..
చరిత్రను ప్రజలే నిర్మిస్తారు.. వ్యక్తులు కాదు
ప్రపంచంలో చూడదగ్గ నగరాల్లో హైదరాబాద్ రెండవది
నేషనల్ జాగ్రఫీ ట్రావెలర్ మేగజైన్ వెల్లడి
చార్‌సౌ సాల్ కా షహర్ హమారా.. ఏషాన్ హమారీ
మరే నగరం హైదరాబాద్‌కు సాటికాదు..
‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం..
”చరిత్రను ప్రజలు నిర్మిస్తారు.. చరిత్ర నిర్మాతలు, నిర్ణేతలు ప్రజలే.. ఇది అక్షర సత్యం. హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్శిస్తుంది. ఇది ఒక రోజులో జరిగింది కాదు. చార్మినార్, గోల్కొండ నిర్మాణానికి రాలెత్తింది తెలంగాణ బిడ్డలే.. పరాయి పాలకులు హైదరాబాద్ టెరరిస్టుల అడ్డాగా ప్రచారం చేస్తే నేషనల్ జాగ్రఫీ ట్రావెలర్ మేగజైన్ చెంప ఛడెలుమనిపించింది. ఇది ప్రపంచంలో చూడదగ్గ రెండవ నగరంగా చాటి చెప్పింది. ఇందుకు దీని చరిత్ర, చారిత్రక కట్టడాలేనని కారణంగా చూపింది.”
హైదరాబాద్ ఘనకీర్తికి మరోసారి ప్రపంచానికి చాటింపయ్యింది. నేషనల్ జాగ్రఫీ ట్రావెలర్ మేగజైన్ ప్రపంచంలోని టాప్ సిటీల లిస్ట్‌లో మొదటి స్థానంలో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం నిలవగా, హైదరాబాద్ టాప్ 2 అంటూ దండోరా వేసింది. ఇటివలే కొందరు హైదరాబాద్‌ను తలదన్నె నగరం సింగపూర్ నగరాన్ని నిర్మిస్తామంటున్నారు. కానీ హైదరాబాద్ ముందు సింగపూర్ బలాదూర్‌గా తెలిపోయింది. హైదరాబాద్ లాంటి 400 యేండ్ల చరిత్రగల నగరానికి ధీటుగా విజయవాడ నుంచి ఓ మహానగరాన్ని నిర్మిస్తానని ఎవరన్నా అంటే దాన్ని మీరెలా అర్థంచేసుకుంటారనేది మీకే వదిలేస్తున్నా. కానీ కొన్ని నిజాలను ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ఒక నగరం నిర్మించటం సాధారణ విషయంకాదు. అందునా హైదరాబాద్ లాంటి వందలయేళ్ల చరిత్రగల మహానగరానికి ధీటుగా ఓ నగరం నిర్మిస్తానంటే ఉత్తరకుమారుడు ఉపన్యాయం ఇచ్చినట్లుంటుంది. హైదరాబాద్‌తో విజయవాడను పోల్చడమంటే ఏనుగును ఎలుకతో పోల్చినట్లే అవుతుంది. మరో విషయం, అసలు తమ విరాళాలను బాబు నిజాయితీగా ఖర్చుపెట్టి సింగపూర్ లాంటి మహానగరాన్ని నిర్మిస్తాడా అని సందేహాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా విజన్ 2029 పెట్టుకున్నాడు. మొత్తానికి గొప్ప రాజధాని నిర్మించి కేసీఆర్ కన్నా దీటైన పాలన అందించాలని తపన పడుతున్నడు చంద్రబాబునాయుడు, సింగపూర్ పర్యటనలతో బాబు ఇప్పటికే హోరెత్తించారు. విజయవాడలో హైదరాబాద్‌ను తలదన్నేలా రాజధానిని నిర్మించి, పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని చంద్రబాబు పెట్టుకున్నారు. సింగపూర్ సిటి లక్ష్యంతో ముఖ్యమంత్రి విజయవాడ అభివృద్ధిపైన దృష్టి పెట్టడం స్వాగతించాల్సిన అంశమే. అయితే ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కున్న ప్రత్యేకత వేరని అందరికీ చాటిచెపుతున్న ట్రావెలర్ మేగజిన్ నుండి బాబు లాంటివాళ్లు తెలుసుకోవాల్సిందయితే ఉంది. అదే హైదరాబాద్ కీ షాన్. ఇన్నాళ్లగా హైటెక్ సిటీని నేనే అభివృద్ధి చేశానని డప్పుకొట్టుకున్న బాబు గుర్తించాల్సిన విషయం ఇదే. హైదరాబాద్ పైన బడి దోసుకున్న ఆంధ్ర బాబులకు ఎన్నేళ్లయినా హైదరాబాద్ లాంటి నగరం నిర్మాణం కలే. మరో వందేళ్లు గడిచినా 400 వందల ఏండ్ల చరిత్రగల హైదరాబాద్‌ను తలదన్నేకాదు కదా కనీసం అలాంటి నగరం నిర్మించటం కూడా అసాధ్యం. అదే ట్రావెలర్ మేగజిన్ నిరూపించిన నగ్నసత్యం. హైదరాబాద్‌ను టాప్ 2లో నిలిపిన ఆ మేగజిన్ సింగపూర్ ఊసే ఎత్తలేదు. హైదరాబాద్ అంటే ఏందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. నక్షత్రాలు చూస్తూ కాలం వృథా చేసిన కవిలా కాకుండా..హైదరాబాద్‌ను మరిచిపోయి తమ పని తము చూసుకుంటే మంచిది.
హైదరాబాద్ అమ్ములపొదిలో ఇలాంటి కీర్తి కిరీటాలు గడిచిన చరిత్రలో హైదరాబాద్ ఒడి చేరిన సందర్భాలెన్నో. హైదరాబాద్ షాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 400 యేళ్ల పైబడిన ఘనచరిత్ర మన సిటీ సొంతం. 1591లో కులీకుతుబ్ షా పాలనలో పురుడు పోసుకున్న హైదరాబాద్ తదనంతరం వందేళ్లకుపైగా నిజాంల పాలనలో అంచెలంచెలుగా విస్తరించింది. మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ లాంటి ప్రపంచంలోనే అత్యంత ధని నవాబులేలిన ఘనమైన చారిత్రక నేపథ్యం హైదరాబాద్ మహానగరానిది, నాటి చారిత్రక కట్టడాల నుండి నేటి ఐటీ హబ్స్ వరకు హైదరాబాద్ దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతూనే ఉంది. అందుకే హైదరాబాద్ అంటే బంగారు నగరం అంటున్నది ప్రపంచ ప్రఖ్యాత నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ మేగజిన్. ఈ మేగజిన్ వార్షిక గైడ్‌లో.. 2015లో చూడాల్సిన ప్రపంచంలోని 20 అత్యంత ప్రసిద్ధ నగరాల పేర్లను ప్రచురించింది. ఈ మేగజిన్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో రెరడో అత్యంత ప్రసిద్ధిచెందిన మంచి నగరంగా కీర్తి గడించింది. మేగజిన్ డిసెంబర్2014-జనవరి 2015 ఎడిషన్‌లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది, అంతేకాక.. హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు అడ్డాగా మారిన కమ్రాన్ని, సంపన్నమైన తాజ్ ఫలక్‌నమా పాలెస్ మొదలు గల్లీల్లోని ఇరానీ కేఫ్‌ల వరకు, ముత్యాల నుండి గాజుల వ్యాపారుల దాకా, ఇలా ఇంకెన్నో హైదరాబాద్‌కు సంబంధించిన ప్రత్యేకలను వివరించింది. నిజమే మరి హైదరాబాద్‌కు ఏం తక్కువ? తరగని వారసత్వ సంపద హైదరాబాద్ సొంతం, హైదరాబాద్‌లో చారితక్ర చిహ్నాలుగా నిలుస్తున్న చార్మినార్, గోల్కొండ కోటలకు ఎంతటి ఘన చరిత్ర ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవేకాక ఇంకెన్నో చారిత్రక ఆనవాళ్లు, మ్యూజియంలు, చెరువులు, ఉద్యానవనాలు ఇక్కడున్నాయి.
గత వలస పాలనలో అవన్నీ నిర్లక్ష్యానికి గురి కాకుంటే, వాటిని టూరిజం స్పాట్లుగా మలిచి ఉంటే ఇంకెంతో వృద్ధి చెందేది. మరీ ముఖ్యంగా ఇక్కడి వంటకాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మహానగరం హైదరాబాద్. ఇక్కడి వంటకాలైన హైదరాబాదీ బిర్యానీ, హలీంలు ప్రపంచఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు వస్తే బిర్యానీ తినకుండా తిరిగి వెళ్లే వారుండరు. రంజాన్ సీజన్‌లో చేసే హలీం ఖండాంతరాలకు ఎక్స్‌పోర్ట్ అవుతుంది. శతాబ్దాలుగా నెలకొన్న ఇక్కడి ఓల్డ్‌సిటీ షాపింగ్ బజార్లు , నుమాయిష్‌లు ఇక్కడి వందల యేండ్ల సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్లు నిదర్శనాలు.
కాలానికి తగ్గట్లుగా హైదరాబాద్ కూడా కొత్తపుంతలు తొక్కుతూనే ఉంది. ఆధునిక నగరానికి ఉండాల్సిన అన్ని హంగులూ హైదరాబాద్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయి షాపింగ్ మాల్స్, రిక్రియేషన్ సెంటర్లు, రిసార్టులు, క్లబ్బులు, పబ్బులు ఇలా ప్రపంచ స్థాయి మహానగరానికి ఉండాల్సిన అన్ని సొబగులు మన నగరానికి ఉన్నాయి. ఇవేకాదు ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలన్ని తమ పునాదులు నిర్మిస్తున్నాయి. ఒక్క ఐటీ కంపెనీలే కాక ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు, ఇండస్ట్రీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇందుకు కారణం ఇక్కడి అనువైన వాతావరణం. ఇది ఒకటైతే.. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించటానికి అనుకూలమైన పాలసీలు తెస్తున్న ప్రస్థుత ప్రభుత్వ చిత్తశుద్ది కూడా మరో కారణం. వలసాంధ్ర పాలనలో భూ దోపిడీయే కాక, రకరకాలుగా దోపిడీకి గురైన హైదరాబాద్ మహానగరం సీఎం కేసీయార్ ముందుచూపుతో మరింత ఉత్సాహంగా అభివృద్ధి చెందుతోంది. నగరానికి తలమానికమైన హుస్సేన్‌సాగర్ చెరువు పారిశుద్యం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలా ఎన్నో ధ్వంసమైన హైదరాబాద్ సంపదలు స్వ రాష్ట్ర పాలనలో తిరిగి జీవం పోసుకుంటున్నాయి.