హైదరాబాద్ స్టేట్ అభివృద్ధిపై నిజాం బృహత్తర ప్రణాళిక
1946లో ‘కాస్ సిటీ క్రానికల్ -మిషిగన్ మిర్రర్ ‘ అమెరికా పత్రికలో ప్రత్యేక కథనం
సంస్థానం విలీనంతో నిలిచిన అభివృద్ది
ఆంధ్రాలో విలీనంతో అన్ని రంగాల్లో దోపిడీ
హైదరాబాద్, జనవరి04(జనంసాక్షి): నాటి హైదరాబాద్ సంస్థానం, బ్రిటిష్ ఇండియాలో అతిపెద్ద సంస్థానం, నేటి తెలంగాణ రాష్ట్రం, వలసాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురై అభివృద్ధికి దూరమైపోయిందని బల్లగుద్ది చెప్తున్న మరో చారిత్రక ఆధారం పై జనంసాక్షి ప్రత్యేక కథనం…
ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుడుగా ఏడో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చరిత్రలో స్థానం సంపాదించుకున్నప్పటికీ తన సంస్థాన పాలనలో ప్రజా సంక్షేమం కోసం, భావి ప్రగతి కోసం దూరదృష్టితో ఎన్నో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రణాళికల రూపకల్పనలో ఆనాటి నిజాం ప్రభుత్వంతో కలిసి పనిచేసిన బ్రిటిష్ ఇంజనీర్ స్లాటర్ కృషి కూడా తోడయింది. 1946 నవంబర్ 15న మిషిగన్ మిర్రర్ అనే ఆంగ్ల పత్రికలో ప్రపంచంలోనే అత్యధిక సంపన్నుడి వద్ద భారీ ప్రణాళికలు, భారతదేశం(బ్రిటిష్ ఇండియా)లో రూపుదిద్దుకోనున్న ప్రాజెక్టులపై ఇంజనీర్ వివరణ’ – అన్న పతాక శీర్షికతో కథనాన్ని ప్రముఖంగా ప్రచురించారు.
ఈ కథనాన్ని పరిశీలిస్తే నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగా ఆలోచించారో, ఎన్ని కలలు కన్నారో స్పష్టమవుతుంది. ఈ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన నాటికి హైదరాబాద్ సంస్థాన పరిధిలోని జనాభా కోటి అరవై లక్షలు. ఇంత భారీ జనాభా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలిస్తున్న నిఖార్సయిన నవాబుగా ఉస్మాన్ అలీ ఖాన్ గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సంకల్పించారు. ఆ మేరకు 12 కోట్ల 50 లక్షల అమెరికన్ డాలర్లతో పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అప్పట్లో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ కేవలం మూడున్నర రెట్లు మాత్రమే అధికం.
అమెరికాలోని టెన్నిస్సీ వాలీ ప్రాజెక్టుకు ఏ మాత్రం తీసిపోని విధంగా మినార్లతో కూడిన ఈ చారిత్రక హైదరాబాద్ నగరంలో ఓ భారీ ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. ఈ భారీ ప్రాజెక్టు మొదట 50 లక్షల యూఎస్ డాలర్లతో ఓ సరికొత్త పారిశ్రామికనగర నిర్మాణంతో ప్రారంభం చేయాలనుకున్నారు.
గోదావరి నది పరివాహక ప్రాంతం అభివృద్ధికి 5 నుంచి 7 సంవత్సరాల కాలం పడుతుందని అంచనా వేశారు. నిజాం కేటాయించాలనుకున్న మూల నిధిలో దాదాపు సగం మౌలిక రంగానికే అంటే పవర్ ప్లాంట్‌లు, రైల్వేలు మరియు పారిశ్రామిక నగరానికే అవుతుందని ఆయన అంచనా వేశారు. ఈ నిధులన్నీ నిజాం ప్రభుత్వమే భరించటానికి సిద్ధమయింది.మిగతా సగం ప్రయివేటు పెట్టుబడిదారులను భాగస్వాములను చేస్తూ పరిశ్రమలు నిర్మించేందుకు ఖర్చు చేయాలని నిజాం ప్రభుత్వం యోచించింది. గోదావరి నదికి సంబంధించిన అభివృద్ధి పనులు పూర్తయితే 5లక్షల మంది ఉపాధి పొందటమే కాకుండా దాదాపు 20లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని అంచనా వేశారు.
‘మోడల్ సిటీకి కరెంటు సరఫరా చేయటానికి 40000 కిలోవాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టాలనుకున్నారు. గోదావరి నదిపై తలపెట్టిన మూడు డ్యాంలలో మొదటిది 150000 కిలోవాట్ల విద్యుత్‌ను అందించేలా నిర్మించనున్నారు. ఇక మిగిలిన రెండు డ్యాంలు ప్రధానంగా 20 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా నిర్మించాలనుకున్నారు. సంవత్సరానికి 5లక్షల టన్నుల నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేసేందుకు పనులు ప్రారంభించాలనుకున్నారు. ఖనిజాన్ని శుద్ధి చేసేందుకు విద్యుత్ వినియోగించాలనుకున్నారు.
నిజాం ప్రణాళికల్లో 650 మైళ్ల రైలు మార్గం నిర్మాణం, కాగితం తయారీ మిల్లు, పత్తి,రేయాన్ వస్త్ర పరిశ్రమలు, భారీ యంత్రాల తయారీ కర్మాగారాలు, ప్లాస్టిక్, ఫర్నిచర్ ఫ్యాక్టరీలు, వీటితోపాటు ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ తయారీ కోసం కూడా ఫ్యాక్టరీలు నిర్మించాలని నిజాం అప్పట్లోనే తలపెట్టారు.