హైదరాబాద్‌ హై టెన్షన్‌

ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు
ఓయూలో పోలీసుల వీరంగం
విద్యార్థులపై దాష్టీకం
ఫిరంగులై పేలిన బాష్పవాయు గోళాలు
తెలంగాణ నలువైపులా నిర్బంధం
మూడుసార్లు అసెంబ్లీని ముట్టడిరచిన పోరు బిడ్డలు
20 వేల మంది పైచిలుకు పోలీసులతో అసెంబ్లీ పహారా
చలో అసెంబ్లీకి సై అంటున్న పోరుబిడ్డలు
హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) :
తెలంగాణ నడిగడ్డ పోరు అడ్డగా మారింది. చలో అసెంబ్లీ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో హై టెన్షన్‌ నెలకొంది. సీమాంధ్ర సర్కారు కుట్రలు, హైదరాబాద్‌ పోలీసుల కుతంత్రాలను అధిగమించిన పోరుబిడ్డలు ముందడుగు వేస్తున్నారు. నిర్బంధాలను ఛేదించుకొని రాష్ట్ర రాజధాని వైపు అడుగులు వేస్తున్నారు. టీ జేఏసీ పిలుపునిచ్చిన చలో అసెంబ్లీకి ఒక రోజు ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ సక్సెస్‌ అయింది. ఖాకీ వలయంలా ఉన్న వర్సిటీలోంచి బయటికి వచ్చిన విద్యార్థులు మూడు బృందాలుగా విడిపోయి మూడు పర్యాయాలు అసెంబ్లీ గేటు వద్దకు చేరుకుని జై తెలంగాణ నినాదాలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చిన విద్యార్థులను పోలీసులు వెంటాడి పట్టుకొని అరెస్టు చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను బేఖతరు చేసిన ఖాకీలు యూనివర్సిటీలో ప్రవేశించి విద్యార్థులను చితకబాదారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ రెండో రోజూ రణరంగమైంది. విద్యార్థులకు, పోలీసులకు మధ్య భీకర ‘యుద్ధం’ జరిగింది. తెలంగాణ నినాదాలు, ఖాకీల తుపాకీల మోతలతో మార్మోగింది. రాళ్ల దాడులు, బాష్పవాయు గోళాలతో క్యాంపస్‌ హోరెత్తింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీఎస్‌ జేఏసీ) ఆధ్వర్యంలో ఎనిమిది విద్యార్థి సంఘాలు గురువారం నిర్వహించ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ రణరంగాన్ని తలపించింది. విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. వాగ్వాదం, తోపులాట, రాళ్ల వాన, టియర్‌గ్యాస్‌ ప్రయోగంతో ఉస్మానియా ఉద్రిక్తంగా మారింది.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీ`జేఏసీ శుక్రవారం తలపెట్టిన చలో అసెంబ్లీకి సన్నాహకంగా టీఎస్‌ జాక్‌ నేతృత్వంలో ఏఐఎస్‌ఎఫ్‌, ఎంఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ సహా ఎనిమిది విద్యార్థి సంఘాలు ‘చలో అసెంబ్లీ’ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆర్ట్స్‌ కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరారు. కాగా, బుధవారం తెలంగాణ విద్యార్థి పరిషత్‌ (టీజీవీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. ఓయూ చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఆర్‌ఏఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను రంగంలోకి దించారు. టీఎస్‌ జాక్‌ విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో ఎన్‌సీసీ గేటు వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు అడ్డం పెట్టారు. ర్యాలీగా వచ్చిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్దే నిలిపివేశారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని, క్యాంపస్‌ దాటి వెళ్లేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నినాదాలతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ’, ‘పోలీసు గో బ్యాక్‌’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఎంతకీ పోలీసులు ముందుకు వెళ్లనీయక పోవడంతో విద్యార్థులు ముళ్లకంచెను లాగిపడేశారు. అడ్డంగా పెట్టిన బారికేడ్లను తొలగించేందుకు యత్నించారు. బారికేడ్లను తొలగించి క్యాంపస్‌లోకి లాక్కుపోయారు. ఎన్‌సీసీ గేటు దాటేందుకు యత్నిస్తుండగా.. పోలీసులు రెచ్చిపోయారు. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దీంతో విద్యార్థులు ఎదురుదాడికి దిగారు. ఖాకీలపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసుల దాడితో వెనక్కు వెళ్లిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత మళ్లీ ముందుకు వచ్చారు. మళ్లీ పోలీసులు అడ్డుకోవడం, విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించడం, భాష్పవాయు గోళాలు మార్మోగడం దాదాపు మూడు గంటలకు పైగా యుద్ధ వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులతో ఉస్మానియా వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ముళ్ల కంచెను తొలగించేందుకు యత్నించిన ముగ్గురు విద్యార్థుల చేతులకు గాయాలయ్యాయి. మరోవైపు, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా, ప్రత్యక్ష ప్రసారాలు చేయకుండా పోలీసులు ఎలక్టాన్రిక్‌ విూడియాకు చెందిన కొన్ని చానళ్ల వైర్లను కత్తిరించారు. దీనిపై జర్నలిస్టులు తీవ్రంగా మండిపడ్డారు.

ఖాకీమయమైన ఓయూ పరిసరాలు
టీ`జేఏసీ చలో అసెంబ్లీ నేపథ్యంలో పోలీసు అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిన ఉస్మానియా యూనివర్సిటీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. విద్యార్థులు క్యాంపస్‌ దాటి బయటకు వస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని భావిస్తున్న పోలీసులు.. వారిని బయటకు రాకుండా నిలువరించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఎన్‌సీసీ గేటు, తార్నాక మార్గాన్ని అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్‌ నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో ముళ్ల కంచెలు వేశారు. ఓయూ చుట్టూ సీఆర్పీఎఫ్‌, ఆర్‌ఏఎఫ్‌ బలగాలను మోహరించారు. ఒక్క ఎన్‌సీసీ గేటు వద్దే సుమారు 30 కంపెనీల బలగాలను వినియోగిస్తున్నారు. అలాగే తార్నాకతో పాటు మాణికేశ్వర్‌నగర్‌ వద్ద కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. క్యాంపస్‌ నుంచి రాకపోకలు నిలిపివేశారు.
చలో అసెంబ్లీ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి రానున్నట్టు తెలిపారు. సైబరాబాద్‌, హైదరాబాద్‌లలో పూర్తిస్థాయిలో 144వ సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ఖైరతాబాద్‌, నారాయణగూడ, మాసబ్‌ట్యాంక్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీకి వచ్చే అన్ని మార్గాలను మూసివేయనున్నారు. అసెంబ్లీ నుంచి అడుగడుగునా పలు మార్గాల్లో సిసి కెమెరాలను అమర్చారు. జంటనగరాల్లో 75 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను, బార్‌లను మూసివేశారు. లింగంపల్లి-హైదరాబాద్‌, ఫలక్‌నుమా-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఎంఎంటిఎస్‌ రైళ్లను శుక్రవారం రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రద్దు చేశారు. పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల శివారు ప్రాంతాల్లోని స్టేషన్లలోనే నిలిపివేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని అధికారులు కోరారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పాఠశాలలకు, కళాశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని పాఠశాలలకు, జూనియర్‌ కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. జంట నగరాల్లోని ఎంజిబిఎస్‌, జూబ్లీ బస్‌ స్టేషన్‌ వద్ద భారీగా పోలీసులను మొహరింపజేయనున్నట్టు తెలిపారు. అలాగే నాంపల్లి, సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద కూడా భారీ భద్రతను కల్పించారు. గురువారం రాత్రి 11 గంటలనుంచే పలు రహదారులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. గత మూడు రోజులుగా తెలంగాణ రహదారులను ఎక్కడికక్కడ మూసివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అరెస్ట్‌లు చేసిన పోలీసులు చాలా మందిని అడ్డుకున్నారు. పోలీస్‌స్టేషన్లకు తరలించారు. బైండోవర్ల పేరుతో రెవెన్యూ అదికారులముందు ప్రవేశపెట్టారు. ఇది ఇప్పటివరకు జరుగగా, ఇక రాజధానిలోని ప్రజలను ఆందోళన జరిగే స్థలం వరకు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోంది. నగరంలోని పలు రహదారులను, ఫ్లైఓవర్లను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో ఎక్కడ చూసినా కూడా పోలీసుబలగాలే కనిపిస్తున్నాయి. కల్లు తెరిచి మూసేలోగానే వందల పోలీసులు కళ్లముందు ప్రత్యక్షం అవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 144 సెక్షన్‌ను అమలుచేస్తూనే ఆంక్షలను తీవ్రంగా చేశారు. ఇక్కడేదో ఉగ్రవాదులు సమావేశం అవుతున్నారనేంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్న పోలీసు యంత్రాంగం బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్‌), సిఆర్‌పిఎఫ్‌, ఆర్‌పిఎఫ్‌, ర్యాపిడ్‌యాక్షన్‌ పోర్స్‌ విభాగాలను రంగంలోకి దింపింది. అడుగడుగునా ముల్లకంచెలను, బారికేడ్లను ఏర్పాటుచేసి అడ్డుకుంటున్నారు. సుమారు 20 వేల మంది పోలీసు బలగాలతో అసెంబ్లీ పరిసరాల్లో పహారా కాయిస్తున్నారు.