హైదరాబాద్‌ శివారులో డ్రైపోర్టు

– రేపల్లె-మచిలీపట్నం రైల్వేలైనే కీలకం
` తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
` తుది దశలో ఉన్న సర్వే ప్రక్రియ
హైదరాబాద్‌(జనంసాక్షి):రేపల్లె-మచిలీపట్నం రైలు మార్గం పూర్తయితే సరకు రవాణా సులభం – తుది దశలో ఉన్న రైల్వే సర్వే ప్రక్రియ – డ్రై పోర్టును నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు తెలంగాణ రాష్ట్రంలో తీరప్రాంతం లేకపోవడంతో హైదరాబాద్‌ శివారులో డ్రైపోర్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతిపాదిత డ్రైపోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టును రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ చేయాలన్నది ప్రణాళిక. ఇది కార్యరూపం దాలిస్తే తెలంగాణ నుంచి విదేశాలకు సముద్రమార్గంలో జరిగే ఎగుమతులు, దిగుమతుల రవాణా మరింత సులభతరమవుతుంది.డ్రైపోర్టు- బందరు పోర్టు అనుసంధానం : ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి రేపల్లె వరకు మాత్రమే రైల్వే నెట్‌వర్క్‌ ఉంది. రేపల్లె-మచిలీపట్నం మధ్య ఇప్పటివరకు రైల్వేలైను లేదు గానీ దానికి సర్వే మంజూరై ఆ ప్రక్రియ చివరి దశలో ఉంది. నవంబరుకల్లా సర్వే పూర్తి చేసి డిసెంబరులో రైల్వేబోర్డుకు నివేదిక సమర్పించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తే డ్రైపోర్టు- బందరు పోర్టు అనుసంధానతకు మార్గం సుగమమవుతుంది.నిర్మించాల్సింది 45.30 కిలో మీటర్లే : రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారుల మధ్య జరిగిన సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఇటీవల వరంగల్‌ నగరానికి వచ్చిన సందర్భంలోనూ ఈ విషయంపై కీలక చర్చ జరిగింది. రేపల్లె నుంచి మచిలీపట్నం లైను అనుసంధానంలో ప్రస్తుతం అవకాశాలు ఎక్కడివరకు ఉన్నాయి. దక్షిణ మధ్య జోన్‌ పరిధిలోని ఈ మార్గంలో ఇంకా చేపట్టాల్సిన చర్యలు ఆ ప్రతిపాదనల తాజా స్థితిగతుల గురించి దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో వివరించారు.గూడ్సు రైళ్ల ద్వారా ఎగుమతులు : రేపల్లె-మచిలీపట్నం మధ్య రైల్వే లైను నిర్మాణం కోసం సర్వే తుది దశలో ఉందన్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య కేవలం 45.30 కిలో మీటర్ల రైల్వే లైను నిర్మిస్తే డ్రైపోర్టు అనుసంధానం అవుతుందని తెలిపారు. ఇది పూర్తయితే గూడ్సు రైళ్ల ద్వారా ఎరువులు, వడ్లు, బియ్యం, గ్రానైట్‌, బొగ్గు వంటివి తెలంగాణ నుంచి నేరుగా బందరు పోర్టు వరకు సులభంగా రవాణా చేయవచ్చు. విజయవాడ రైల్వే జంక్షన్‌పై కూడా చాలా మేరకు ఒత్తిడి తగ్గుతుంది.