హౖదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం


` ప్రారంభించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి రమణ
` 3 నెలల్లోనే తన కల సాకారమైందని సంతోషం
` వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
` పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని వెల్లడి
హైదరాబాద్‌,ఆగస్టు 20(జనంసాక్షి):అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రంతో పెట్టుబడిదారులకు వివాదం లేని వాతావరణం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభోత్సవం నేడు జరిగింది. దేశంలోనే తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఐటీ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టు సీజే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మాట్లాడుతూ ’అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపింది. పెట్టుబడిదారులు వివాదాలు లేని వాతావరణం కోరుకుంటారు. వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలనుకుంటారు. 1926లో తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం మొదలైంది. దుబాయ్‌లోనూ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటైంది. ఆర్బిట్రేషన్‌ కోసం సింగపూర్‌, దుబాయ్‌ వెళ్లాల్సి వస్తుంది. ఆర్బిట్రేషన్‌ కేంద్రం వల్ల కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటైతే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు వస్తారు. మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం హావిూ ఇచ్చారు. ఆర్బిట్రేషన్‌ ఏర్పాటు బాధ్యత జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని కోరుతున్నాను. త్వరగా ఈ కేంద్రం కార్యకలాపాలు జరగాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆర్బిట్రేషన్‌ కేంద్రానికి ఒప్పందం తెలంగాణకు చారిత్రక ఘట్టం. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు నా స్వప్నం. దీని కోసం 3 నెలల క్రితం ప్రతిపాదన చేశాను. నా స్వప్నం సాకారానికి 3 నెలల్లోనే అడుగులు పడతాయని ఊహించలేదు. నా ప్రతిపాదనకు సీఎం సత్వరమే స్పందించారు. ఈ కేంద్రానికి అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. నా కల సాకారానికి కృషి చేస్తున్న కేసీఆర్‌, జస్టిస్‌ హిమా కోహ్లీకి కృతజ్ఞతలు’ అని సీజేఐ అన్నారు. తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీ.. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, పీవీ హయాంలోనే ఆర్బిట్రేషన్‌ చట్టం రూపుదిద్దుకుందని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు.