10 నుంచి మలి విడత బడ్జెట్‌ సమావేశాలు

అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న విపక్షాలు
హైదరాబాద్‌, జూన్‌4 (జనంసాక్షి) :
శాసనసభ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుందున్నాయి. ఈ సమావేశాల సమయంలోనే తెలంగాణ సాధన కోసం టీ జేఏసీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో అసెంబ్లీ ప్రాంతంలో గట్టి భద్రత ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. ఈ నెల ఐదు నుంచి 15వరకు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో, నగరంలో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతి ఇచ్చేది లేదని తెలిపారు. అయితే, ఈ నెల 14వ తేదీన తెలంగాణ రాజకీయ జేఏసీ చలో అసెంబ్లీకి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఎటువంటి ఆటంకాలు కల్పించవద్దంటూ పోలీసులకు జేఏసీ చైర్మన్‌ కోదండరాం విజ్ఞప్తి చేశారు. పోలీసులు అడ్డుకున్నా తాము కచ్చితంగా చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించి తీరుతామని హెచ్చరించారు. అయితే, సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈ చర్యలు తీసుకోవడం సహజమే. ఈసారి చలోఅసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినందున కొద్దిమేర అధికంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మలి విడత సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మంత్రివర్గం నుంచి డీఎల్‌ బర్తరఫ్‌ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి.