100 అడుగుల జెండా ఆవిష్కరించుకోవడం రాష్ట్రానికి తోర్రుర్ పట్టణానికి గర్వకారణం

 

-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్28(జనంసాక్షి)

తొర్రూర్ పట్టణంలో 100 అడుగుల జెండా నిర్మాణం ఆవిష్కరించడం యావత్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం ఉదయం రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను తొర్రూరు డివిజన్ కేంద్రంలోని జడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో, స్వాతంత్ర సమరయోధులు విద్యావేత్త చుక్కా రామయ్య, జిల్లా కలెక్టర్ కె శశాంక, ఎస్ పి శరత్ చంద్ర పవార్ లతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరచాల ధ్వనుల మధ్య వందేమాతర నినాదాలతో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జెండాను మంత్రి ఆవిష్కరించారు. డాక్టర్ పొనుగోటి సోమేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సమావేశాన్ని అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో 100 అడుగుల ఎత్తుతో జాతీయ జెండా ఆవిష్కరించడం ఎంతో సంతోషం గర్వకారణమని, దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాతీయ జెండా 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు తో రెప రెప లాడుతుందంటే లక్షల మంది ప్రాణ త్యాగాలు ఎప్పటికీ కదలాడుతూనే ఉంటాయని, 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనలో మగ్గి అనేక ఉద్యమా లు పోరాటాల బలిదానాల ద్వారా స్వాతంత్ర్యం సిద్ధించిoదని అన్నారు. జాతీయ జెండా కోసం సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, డాక్టర్ సోమేశ్వర్ రావు మరియు ఇతర దాతలు కలిసి కమిటీ గా ఏర్పడి జాతీయ సమైక్యతా కోసం ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని,
దీని నిర్మాణం కోసం డి.ఆర్.డి.ఓ మరియు ఇస్రో వారి సాంకేతిక సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందని,ఈ జెండా ఫ్లాట్ ఫారం 30×30 అడుగుల పొడువు, వెడల్పుతో నిర్మాణం చేయడం జరిగిందని దీని భద్రతా కోసం ఫెన్సింగ్, గార్డెనింగ్ మరియు సి.సి కెమెరా ల ఏర్పాటు పోలిస్ ఆద్వర్యంలో ఉన్నదని దీని నిర్మాణం కోసం కేవలం 15 రోజుల్లో రాత్రి, పగలు కష్టపడి నిర్మాణం చేయడం అభినందనీయమని అన్నారు.

-ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే ప్రధమని స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాది పింగిలి వెంకయ్య 1921 సంవత్సరంలో జాతీయ పతాకన్ని రూపకల్పన చేశారని జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగులు కాషాయం ధైర్యము, ధృడత్వాని, తెలుపు శాంతిని, సత్యమును, ఆకుపచ్చ ఉత్పత్తి, సంపద పెరుగుదల, శుభమును సూచిస్తుందన్నారు. దేశ భక్తి, ఐక్యత గుర్తు చేసేది జాతీయ పతాకమని విద్యార్థులకు స్వాతంత్ర సంగ్రామం గురించి, దేశభక్తి భావాలను తెలియజేయాలి. ప్రతి ఇంటి పై జెండా ఎగరవేసే అవకాశం కల్పించడం హర్షణీయం. భారత స్వాతంత్ర సంగ్రామం, తదనంతర జాతి నిర్మాణంలో మువ్వన్నెల పతాక పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని దేశ స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం తన, మన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని వారి త్యాగాల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే గొప్ప సంకల్పంతో తొర్రూరు లో భారీ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, భారత దేశానికి స్వాతంత్ర్య సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నిర్వహించుకున్నాము. ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద జెండా జమ్ము కాశ్మీర్ లో లేహ్ లో వుందని తెలంగాణ వచ్చాక మన రాష్ట్రంలో హైదరాబాద్, సంజీవయ్య పార్కు లో 291 అడుగుల జెండా ను ఏర్పాటు చేశారని, ఆ తరువాత ఇప్పుడు రాష్ట్రంలో రెండవది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటిది మనం ఏర్పాటు చేసుకున్న పెద్ద జెండా ఇదే అని, ముఖ్యమంత్రి ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించి అందరిలో జాతీయ భావాన్ని పెంచారని, ఆనాటి స్వాతంత్ర యోధుల స్ఫూర్తిని మనం మనసు నిండా నింపుకున్నామని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ఇప్పటికే మన ఐకమత్యాన్ని చాటామని, ఈ జాతీయ పెద్ద జెండా ఆవిష్కరణ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. సీఎం కెసిఆర్ గాంధీజీ అహింస మార్గం ద్వారా తెలంగాణ ను సాధించారని, సాధించిన తెలంగాణను గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అభివృద్ది చేస్తున్నారని, మన రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ది పరుచుకున్నమో దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని మనమంతా ఐక్యత ను చాటి మన రాష్ట్ర, దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని అన్నారు. దింసా కోయ నాట్యం ఎంతో ఆకర్షణగా నిలువగా, వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతో ఆకర్శనీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, జడ్పీ టి సి శ్రీనివాస్, ఎం పి పి ఆంజయ్య, అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.