108 అంబులెన్సుల పరిస్థితి దారుణం

108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
– సూర్యనారాయణ
శ్రీకాకుళం, జూలై 25 : రాష్ట్రంలో, జిల్లాలో 108 వాహనాల పరిస్థితి దారుణంగా ఉందని 108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ చెప్పారు. బుధవారం నాడు స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2007 సంవత్సరం నుంచి ఇంత వరకు కొత్తగా ఒక్క అంబులెన్స్‌ కూడా జిల్లాకు రాలేదని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 26 అంబులెన్సులు ఉన్నాయని ఇందులో మూడు మరమ్మతులకు గురైన కారణంగా తిరగడం లేదని అన్నారు. నిర్దేశించిన కిలో మీటర్లు తిరిగే వాహనాలను ఆపేయాలని రాష్ట్రంలో 350 వాహనాలు ఈ పరిమితికి దాటి తిరుగుతున్నాయని తెలిపారు. 250 వాహనాలకు సైరేన్‌ లేదని దీని వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. వాహనానికి ఉన్న టైర్లు కండిషేన్‌లో లేవని అన్నారు. కొన్ని వాహనాల్లో పరికరాలు లేవని అవిలేకపోవడం వల్ల రోగులకు పరీక్షలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం కారణంగా అంబులెన్స్‌లు కారిపోతున్నాయని పేర్కొన్నారు. సిబ్బంది కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి వేళ్లలో 60 షిఫ్టులు ఆగిపోతున్నట్లు వెల్లడించారు.కడప, మహబూబ్‌నగర్‌ జిల్లాలో సిబ్బంది లేక కొందరికి రోజు వారి వేతనం 250 రూపాయలు చెల్లించి అంబులెన్స్‌లు నడిపిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.