12న జరిగే కోర్‌కమిటీ సమావేశంలో


తెలంగాణపై నిర్ణయం
కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) :
తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈనెల 12 జరిగే కోర్‌కమిటీ సమావేశంలో ఈ మేరకు స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. తెలంగాణపై తనకంటూ వ్యక్తిగత అభిప్రాయం ఏదీ లేదని, రాష్ట్ర నాయకులిచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు. సీఎం, డెప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ ఇచ్చే నివేదికలను ఆధారం చేసుకుని చర్చిస్తామన్నారు. ఈనివేదకల ఆధారంగా 12వ తేదీన జరిగే కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చిస్తామని దిగ్విజయ్‌ సింగ్‌ చెప్పారు. కోర్‌ కమిటీలో చర్చించిన అనంతరం తెలంగాణపై ఓ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన చెప్పారు. విభజనకు సంబంధించి రకరకాల డిమాండ్లు వినిపిస్తున్నాయన్నారు. ఈ అంశంపై ప్రత్యేకంగా తనకంటూ ఓ అభిప్రాయం లేదని, నిర్ణయం కోసం తాను కూడా వేచి చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ సమస్యకు తర్వాత పరిష్కారం లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  అంతకుముందు దిగ్విజయ్‌ సింగ్‌ను రాయలసీమ జేఏసీ కలిసింది.  తెలంగాణవాదం తెలంగాణ రాష్ట్ర సమితిదో, ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుదో మాత్రమే కాదని తెలుగుదేశం పార్టీ నేత కెఎస్‌ రత్నం అన్నారు. అన్ని పార్టీలు తెలంగాణను కోరడం ఆయనకు ఇష్టం లేదన్నారు. కేసీఆర్‌ ఆలోచనలకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులు చేయించడం తెరాసకు అలవాటే అన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులును హత్య చేయించేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గతంలో ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రవీంద్రనాయక్‌, చింతస్వామి, గద్దర్‌ పైన దాడులు చేయించారని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.