12 శాతం ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడ్డాం

COVER19

వెయ్యి కోట్ల బడ్జెట్‌ కేటాయించాం

వక్ఫ్‌బోర్డు ఆస్తుల్ని కాపాడుతాం

జ్యుడీషియరీ అధికారాలు ఇచ్చాం

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్‌, జూలై 18 (జనంసాక్షి) :

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లకు కట్టుబడ్డామని, ఎన్నికల హామీలు తప్పకుండా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో శాసన మండలి సభ్యుడు మహ్మద్‌ సలీం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం కేసీఆర్‌ సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. వెయ్యి కోట్లతో మైనార్టీ సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయించామని, వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడుతామని చెప్పారు. వక్ఫ్‌బోర్డు భూముల పరిరక్షణకు సెషన్స్‌ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియరీ అధికారాలతో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత విలువైన వక్ఫ్‌భూములను ఇష్టారాజ్యంగా కేటాయించారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని ముస్లింల అభివృద్ధికి ఉపయోగిస్తామని తెలిపారు. ఈ ఇఫ్తార్‌ విందులో ఉప ముఖ్యమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తన్నీరు హరీశ్‌రావు, పి. మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.