*13న ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి*
– టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పొనుగోటి కోటయ్య
మునగాల, సెప్టెంబర్ 10(జనంసాక్షి): ఉపాధ్యాయ సమస్యల పట్ల, విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 13న యూఎస్ పి సి ఆధ్వర్యంలో చేపట్టే ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉపాధ్యాయులంతా పాల్గొని విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ పొనుగోటి కోటయ్య శనివారం ఒక ప్రకటనలో ఉపాధ్యాయ లోకానికి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల పదోన్నతులు లేక ఏడు సంవత్సరాలు అవుతుందని, బదిలీలు లేక నాలుగు సంవత్సరాలు అవుతుందని, వెంటనే పదోన్నతులు బదిలీల షెడ్యూలును ప్రకటించాలన్నారు. గత ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు లేక హెచ్ఎం, ఎంఈఓ, డిప్యూటీ ఈవో మరియు డిఇఓ పోస్టులను నింపక విద్యావ్యవస్థ చిన్నాభిన్నమైంది అన్నారు. 11, 12 సంవత్సరములుగా ఒకే చోట పని చేస్తూ బదిలీ కాక ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని ఒకే చోట పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. జీవో 317 పరిధిలో స్పౌజులు, స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగాలలో చేరిన ఉద్యోగులకు నష్టం కలిగించే కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని ఉద్యోగులందరికీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలో సర్వీస్ పర్సన్స్ నీ నియమించాలని ప్రకటనలో కోరారు.