14 నుంచి ధృవపత్రాల పరిశీలన
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు టి.సర్కారు నోటిఫికేషన్
హైదరాబాద్ ఆగస్టు 12 (జనంసాక్షి) : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సాంకేతిక ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుంది. 14న 25 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేస్తారు. 16న 50 వేల ర్యాంకు వరకు, 17న 75వేల ర్యాంకు వరకు, 18న లక్ష ర్యాంకు వరకు, 20న లక్షా 25వేల ర్యాంకు వరకు, 21న లక్షా 50 వేల ర్యాంకు వరకు, 22న లక్షా 75 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. అయితే 15 మరియు 19న సర్టిఫికెట్ల పరిశీలనకు సెలవు అని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు వచ్చేప్పుడు అభ్యర్థులు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు తీసుకుని రావాలని కోరారు. 1-1-2014 తర్వాత జారీచేసిన ఆదాయ, కుల ధృవపత్రాలు తీసుకుని రావాలని ఎంసెట్ కో-కన్వీనర్ తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ర్యాంకు కార్డు, హాల్‌టికెట్ తీసుకురావాలని పేర్కొన్నారు. ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి తమ కౌన్సెలింగ్ తామే చేసుకుంటామని పట్టుబట్టిన టీ-సర్కారు అనుకున్నది సాధించింది. మంగళవారం ఇరు రాష్టాల్ర విద్యామండళ్ల ఉన్నతాధికారులు కౌన్సెలింగ్‌పై చర్చించారు. టీ-ఉన్నత విద్యామండలి ప్రకటించే తేదీలను అంగీకరించాలని ఏపీ అధికారులు నిర్ణయించారు. దీంతో వివాదానికి తెరపడింది. ఈ నెల 14 నుంచి తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నెల 31లోపు కౌన్సెలింగ్ పూర్తిచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. గడువు పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు సోమవారం తోసిపుచ్చింది. విభజన చట్టంలోని అంశాల ప్రకారమే ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహించాలని తేల్చిచెప్పింది. పునర్విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. అయితే, ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని, అదే సమయంలో సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలికి సమాచారమిచ్చింది. దీనిపై ఇరు రాష్టాల్ర ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించే తేదీల్లోనే కౌన్సెలింగ్‌కు అంగీకరించాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన, ఫాస్ట్ పథకం మార్గదర్శకాలు వంటి అంశాలను సత్వరమే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్ని అనుకూలిస్తే 14 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మరోవైపు, సుప్రీం తాజా ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించింది. వెబ్‌ఆప్సన్లకు సంబంధించి రెండు, మూడ్రోజుల్లో నోటిఫికేషన్ జారీచేసేందుకు సన్నాహాలు చేపట్టింది.