15 మృతదేహాలు బంధువులకు అప్పగింత
నెల్లూరు, జూలై 31: సోమవారం ఉదయం తమిళనాడు ఎక్స్ప్రెస్లో జరిగిన ఘోర దుర్ఘటనలో మరణించిన 28 మందికి గాను 15మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ బివి రమణకుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మరో 13 శవాలను గుర్తించాల్సి ఉందని, మృతదేహాలన్నింటినీ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచామని తెలిపారు. అవి చెడిపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మృతుల వివరాలకు సంబంధించిన పరిశోధనలో భాగంగా ఇఎన్ఎ శాంపిల్స్ సేకరించడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ అధికారికంగా నిర్ధారణ చేసిన అనంతరం వారి బంధువులకు మృతదేహాలు అప్పగించడం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా తమతో సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.