18 నుంచి విద్యాపక్షోత్సవాలు పాఠశాల విద్యా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి

శ్రీకాకుళం, జూన్‌ 12 : ఈ నెల 18 నుంచి  జులై 2 వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహించాలని పాఠశాల విద్యా ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చందనఖాన్‌ ఆదేశించారు. శత శాతం ఎన్‌రోల్‌మెంట్‌ జరగాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులతో పాటు జిల్లాలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో డ్రాప్‌ అవుట్స్‌ రాకుండా చూడాలని చెప్పారు. మండల స్థాయిలో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, విద్యాశాఖ అధికారులు, ఎమ్మార్పీలతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందం డ్రాప్‌అవుట్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.  గ్రంథాలయ సంస్థలకు మంజూరు చేసిన బిడిసి సెంటర్లను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. గ్రామాల వారీగా డ్రాప్‌ అవుట్‌ల వివరాలు తెప్పించి జిల్లా గ్రంథాలయ సంస్థ  శాఖ గ్రంథాలయ వద్ద అందరికీ కనిపించేలా ప్రదర్శించాలన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కల్గకుండా పాఠ్య పుస్తకాలు, తమ యూనిఫామ్‌ దుస్తులు సకాలంలో సరఫరా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్వో నూరుభాషాఖాశీం, జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖఅధికారిణి ఎస్‌.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.