18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరు కార్డు నమోదు చేసుకోవాలి:అదనపు కలెక్టర్ రమేష్

  మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):ప్రజాప్రథినిధులు తమ వంతుగా స్వీయ బాధ్యతతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవడంలో, ఓటర్ కార్డుకు ఆధార్ ను అనుసంధానం చేయడంలో కృషి చేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ కోరారు. ఒక పోలింగ్ బూత్ లో 1500 ఓటర్లకంటే ఎక్కువ మంది ఉన్న కేంద్రాలను హేతుబద్దీకరించుటపై శుక్రవారం తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలనే లక్ష్యంతో పాటు ఓటు హక్కు వినియోగంలో అవకతవకలు అరికట్టడంపై ఎన్నికల కమీషన్ దృష్టి సారించిందని అన్నారు. జిల్లాలో 576 పోలింగ్ కేంద్రాలలో ఏ ఒక్క కేంద్రంలో కూడా 1500 మించి ఓటర్లు లేరని కాబట్టి నివేదిక నిల్ గా పంపుతున్నామని ప్రజాప్రతినిధులకు తెలిపారు. కాగా జిల్లాలో 4,06,160 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. మెదక్ నియోజక వర్గంలో 2,01,358 మంది ఓటర్లకు గాను 96,910 మంది పురుషులు, 1,04,446 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ఉన్నారని, ఇందులో 63 శాతం ఓటర్లు ఆధార్ కు అనుసంధానం చేసుకున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా నరసాపూర్ నియోజక వర్గంలో 2,05,281 మంది ఓటర్లకు గాను 1,01,411 మంది పురుషులు, 1,03,863 మంది మహిళలు, 7 గురు ట్రాన్స్ జెండర్లు ఉండగా 71 శాతం ఓటర్లు ఆధార్ కార్డు ను అనుసంధానం చేసుకున్నారని, మొత్తంగా జిల్లాలో 67 శాతం ఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్నారని రమేష్ తెలిపారు. ఫారం 6-బి ద్వారా వంద శాతం ఓటర్లు ఆధార్ ను అనుసంధానం చేసుకోవడంతో పాటు అర్హులైన నూతన యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి , ఓటర్ల జాబితాలో చనిపోయిన, పెళ్ళై వెళ్ళిపోయిన, డూప్లికేట్ కార్డు ఓటర్ల తొలగింపులో ప్రజాప్రథినిధులు సహకరించవలసినదిగా ఆయన కోరారు. ఎన్నికల కమీషన్ కూడా ప్రతి ఏడాది జనవరి 1 ని ప్రామాణికంగా 18 సంవత్సరాలు నిండిని యువతకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించేది కానీ నేడు ఏడాదిలో 4 సార్లు అవకాశం కల్పిస్తున్నదని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి ప్రోత్సహించాలని సూచించారు. ఓటరు జాబితాలో మార్పులు,చేర్పులు, సవరణలు,తొలగింపులు అనంతరం నవంబర్ 9 న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తామని,నవంబర్ 10 నుండి డిసెంబర్ వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఓటరు నమోదు ఉంటుందని రమేష్ తెలిపారు.
            ఈ సమావేశంలో ఆర్.డి.ఓ. సాయి రామ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, ప్రజాప్రతినిధులు టిడిపి నుండి అఫ్జల్, కాంగ్రెస్ నుండి మహమ్మద్ ఇస్మాయిల్, టిఆర్ ఎస్ నుండి చింత నరసింహ, బిజెపి నుండి ఉదయ్ కుమార్, ఎలక్షన్ సెల్ నుండి నరేష్, మెదక్, నరసాపూర్ నుండి బి.ఎల్.ఓ. లు తదితరులు పాల్గొన్నారు.