194 మందితో కాంగ్రెస్ తొలి జాబితా
రాయ్‌బరేలి నుంచి సోనియా
అమేథి నుంచి రాహుల్
మహ్మద్ కైఫ్, వాజపేయి మేనకోడలు కరుణాశుక్లాకు చోటు
న్యూఢిల్లీ, మార్చి 8 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 194 లోక్‌సభ స్థానాలకు శనివారం తన అభ్యర్థులను ప్రకటించింది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ మళ్లీ రాయ్‌బరేలి నుంచే బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అమేథి నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో క్రికెటర్ మహ్మద్ కైఫ్, నందన్ నిలేకని, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి మేనకోడలు కరుణా శుక్లా, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తదితరులు ఉన్నారు. ఆధార్ ప్రాజెక్ట్‌ను చేపట్టిన యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని బెంగళూరు సౌత్ స్థానం నుంచి, క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఉత్తరప్రదేశ్‌లోని పూల్‌పూర్ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖరారయ్యారు. షోలాపూర్ నుంచి షిండే పోటీ చేస్తారు. ఇక ఇటీవలే కాంగ్రెస్ తీర్థం స్వీకరించిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మేనకోడలు కరుణా శుక్లాను ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ స్థానం నుంచి ఎన్నికలబరిలో దించాలని పార్టీ నిర్ణయించింది,
తొలి జాబితాలో చోటు దక్కించుకున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖులలో సుశీల్ కుమార్ షిండే (షోలాపూర్-మహారాష్ట్ర), కమల్‌నాథ్ (చింద్వారా-మధ్యప్రదేశ్), మల్లికార్జున ఖర్గే (గుల్బర్గా-కర్ణాటక), గిరిజా వ్యాస్ (చిత్తోర్ గఢ్-రాజస్థాన్), జ్యోతిరాదిత్య సింధియా (గ్వాలియర్-మధ్యప్రదేశ్), ఆర్పీఎన్ సింగ్ (కుశీనగర్-ఉత్తరప్రదేశ్), ప్రణీత్ కౌర్ (పాటియాలా-పంజాబ్), లోక్‌సభ స్వీకర్ మీరాకుమార్ (ససరాం-బీహార్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర – హర్యానా), ముకుల్ వాస్నిక్ (రామ్‌టెక్- మహారాష్ట్ర్ణ), విలాస్‌ముత్తెంవార్ (నాగ్‌పూర్), మీనాక్షీ నటరాజన్ (మాండ్‌సోర్), అమిత్ సింగ్ (సుల్తాన్‌పూర్ – ఉత్తరప్రదేశ్) ఉన్నారు. అలాగే పార్టీ ప్రముఖులు శ్రీప్రకాశ్ జైశ్వాల్, మునియప్ప, మీనాక్షి నటరాజన్, మిళింద్ దేవ్‌రా, గిరిధర్ గొమాంగో, దీపేందర్‌సింగ్ హుడా, శంకర్‌సింగ్ వాఘేలా, నటుడు రవికిషన్, విజయ్ మహంతి, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు ఉన్నారు.