2019లో మోదీకి పరాభవం తప్పదు

– తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమే
– పొత్తులపై స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది
– దేశంలో రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉంది
– మహిళా రిజర్వేషన్‌ల బిల్లుకు కట్టుబడి ఉన్నా
– తాను ఏరకమైన హిందుత్వ విధానాన్ని నమ్మను
– సంపాదకులతో సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
హైదరాబాద్‌, ఆగస్టు14(జ‌నం సాక్షి) : 2019 సాధారణ ఎన్నికల్లో మోదీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా హరిత ప్లాజాలో పత్రిక, ప్రసార మాధ్యమాల సంపాదకులతో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. ఈసమావేశంలో రాహుల్‌ పలు అంశాలపై సంపాదకులతో మాట్లాడారు. మోదీ ప్రధాని కావాలంటే భాజపా కూటమికి 230 సీట్లు రావాలని, అది అసాధ్యమన్నారు. స్థానిక పొత్తులపై స్థానిక నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మా ఆలోచనలతో కలిసి వచ్చే వారిని కలుపుకొని పోతామన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని, ఆంధప్రదేశ్‌లోనూ మెరుగుపడతామని రాహుల్‌ స్పష్టం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోతోందన్న రాహుల్‌.. రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగులకు ఉపాధికల్పన పక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ
మేరకు కేంద్ర ప్రభుత్వం వెనుకంజలో ఉందని రాహుల్‌ విమర్శించారు. చైనా 24గంటల వ్యవధిలో 50 వేల ఉద్యోగాలు కల్పిస్తుంటే భారత్‌లో 458 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. నాకు ఎవరితోనూ శత్రుత్వం, వైరం లేద’ని రాహుల్‌ అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. తాను ఏరకమైన హిందుత్వ విధానాన్ని నమ్మనని రాహుల్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణలో పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ విధానాలను గౌరవించే పార్టీలతో పొత్తుపై ఆలోచిస్తామని ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.
నాకు కాంగ్రెస్‌తో పెళ్లయింది!
కాంగ్రెస్‌ పార్టీతో తన వివాహం జరిగిపోయిందని  రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. విూడియా ఎడిటర్లతో సమావేశంలో రాహుల్‌ పెళ్లిపై ప్రశ్నించారు. దీనికి రాహుల్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనకు పెళ్లి అయిందని రాహుల్‌ చెప్పడంతో ఒక్కసారిగా పాత్రికేయులు ఆశ్చర్య పోయారు.. దీంతో వెంటనే స్పందించిన రాహుల్‌ తనకు పెళ్లియిందని కాంగ్రెష్‌ పార్టీతోనంటూ సరధాగా వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు పూశాయి. అనంతరం పలు విషయాలపై పాత్రికేయులు రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత బీజేపీ పాలన, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు వంటి అంశాలపై రాహుల్‌ కూలంకుశంగా సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.