ఇల్లెందులో 22న పోరుగర్జన

ఖమ్మం,జనవరి20: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇల్లెందులో 22న పోరుగర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి పోటు రంగారావు తెలిపారు.  ఇల్లెందులో జరిగే బహిరంగసభను జయప్రదం చేయాల్సిందిగా కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా లేనట్లుగా ఉందన్నారు. జిల్లాలోని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. బయ్యారంలో స్టీలు ప్లాంటు నెలకొల్పాలన్నారు. కొవ్వూరు రైల్వేలైనును గుండాల దాకా పొడిగించాలని, సింగరేణి సంస్థ భూగర్భగనులను మాత్రం తీయాలని కోరారు. వివిధ సమస్యలను చర్చిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఇల్లెందులో ఏర్పాటుచేయనున్న పోరుగర్జన బహిరంగసభలో ప్రజలు అధికసంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరు నిర్వహిస్తోందని పేర్కొన్నారు.  పోరుగర్జనకు ప్రజలు వేలాదిగా కదలిరావాలని పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాలు, ప్రజలపై కేసులు ఎత్తివేయాలని, భూస్వాముల ఆధీనంలో ఉన్న భూములు పంచాలని, ఉపాధి హావిూ, ఐకేపీ, ఉపరితల గనులు రద్దు చేయాలనే తదితర 20 డిమాండ్ల పరిష్కారానికై ఈ పోరుగర్జన సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు దేశ నలుమూలల నుంచి ఎన్డీ నాయకత్వం తరలివస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల కోసం అర్రులు చాసే శక్తులన్నింటికి ఈ పోరుగర్జన గుణపాఠంగా మారాలని పేర్కొన్నారు.