సఫాయి కర్మ చారీల సంక్షేమానికి అధికారులు కృషి చేయాలి.
జాతీయ సఫాయి కర్మ చారీ కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజన పన్వార్.
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో,జనంసాక్షి:
సఫాయి కర్మచారీలు సామాజికంగా, ఆర్థికంగా అభివద్ధి చెందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో వారి సంక్షేమానికి కృషి చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజన పన్వార్ కోరారు.బుధవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో వివిధ శాఖల జిల్లా అదికారులు, సఫాయి కర్మాచార్యులు, కాంట్రాక్టర్లు తదితరులతో కలిసి ఆమె సమీక్షించారు.మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, గ్రామ పంచాయతీల స్థాయిలో పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల పురోగతిని కార్మికులతో అడిగి తెలుసుకున్నారు.సాంఘిక సంక్షేమం, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్యం, బ్యాంకింగ్, విద్య, కార్మిక, పోలీస్ తదితర శాఖల అధికారులతో చర్చించారు. అసమానతలు లేకుండా సఫాయి కార్మికులు అన్ని విధాలా ఎదిగేందుకు వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడంతో పాటు జీవన ప్రమాణాలు పెంచేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. దేశానికి, సమాజానికి పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారికి సుస్థిర ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు.
రుణ సదుపాయాలతో పాటు పనిచేసే చోట భద్రత కల్పించేలా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన పనిముట్లు, రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.సఫాయి కర్మ చారీల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
ముఖ్యంగా యంత్రాల సహాయంతో కాకుండా చేతులతో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించే వారికి ఎక్కువ కష్టాలు ఉంటాయని, అందువల్ల వీరి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం సఫాయి కర్మ చారీల చట్టాన్ని తీసుకువచ్చిందని ,ఇందులో కాంట్రాక్టు పనివారి కి ఇంకా అనేక సమస్యలు ఉంటాయని అన్నారు. వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా జిల్లాలలో పర్యటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఎవరైనా సపాయికర్మచారీలను వేధిస్తే వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటామని, అంతేకాక ఎవరైనా సఫాయి కర్మచారిలను కాంట్రాక్టర్లు వేధిస్తే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని ఆమె హెచ్చరించారు.
చట్టం లోని నిబంధనల ప్రకారం సఫాయి కర్మ చారిలకు నెలసరి ఇవ్వాల్సిన వేతనంతో పాటు ,పిఎఫ్ ,ఈఎస్ఐ గుర్తింపు కార్డులు వంటివి ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక ప్రత్యేకించి సఫాయి కార్మికులకు ప్రభుత్వం చేస్తున్న పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి వాటిపై అవగాహన కలిగే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. చట్టప్రకారం సఫాయి కర్మ చారిలకు సౌకర్యాలు కల్పించకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆమె తెలిపారు.సఫాయి కర్మచారీలుగా పనిచేస్తున్న ఎస్సీ ,ఎస్టీల పై ఏవైనా వేధింపులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.
అదేవిధంగా మున్సిపాలిటీలో ఖాళీ స్థలాలు ఉంటే ప్రత్యేకంగా వారికోసం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని, స్థల సమస్య ఉంటే అపార్ట్ మెంట్ లు కట్టించాలని సూచించారు.ప్రతి మున్సిపాలిటీల్లో మహిళా కార్మికులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలన్నారు.కార్మికులందరికీ తప్పనిసరిగా ప్రతి మూడు మాసాలకోసారి హెల్త్ క్యాంపులు నిర్వహించి పూర్తి బాడీ చెకప్ చేయాలని ఆమె ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆమె సఫాయి కార్మికులతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.సఫాయి కార్మికుల పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఆమె కార్మికులను ఒక్కొక్కరిని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేగాక సఫాయి కార్మిక సంఘాల లీడర్లను, అసోసియేషన్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.వైద్య ఆరోగ్య శాఖ అధికారి, విద్యాశాఖ అధికారి హాజరు కాకపోవడం ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి హాజరుకాని శాఖల అధికారుల జాబితాని ఇవ్వాలని ఆదేశించారు.అంతకుముందు ఆమె అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సమావేశంలో ఈడి రామ్ లాల్, నాగర్ కర్నూల్ డిఎస్పి మోహన్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కమలాకర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, లేబర్ అధికారి మహమ్మద్ షఫీ, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రావు, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల జిల్లా అధికారులు సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.