28నే అఖిలపక్షం – షిండే స్పష్టీకరణ

– ఫలించని సీఎం రాజకీయాలు

– పార్టీల చేతినే వారి తలపైనే పెట్టిన కేంద్రం

– ఎంతమంది ప్రతినిధులు పంపుతారో పార్టీల ఇష్టం

– సీమాంధ్ర పార్టీలకు అగ్ని పరీక్ష

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) :

తెలంగాణపై ఈనెల 28నే అఖిలపక్ష సమావేశం నిర్వహించి తీరుతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే స్పష్టం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలంగాణపై అఖిలపక్షం నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్లాయి కనుక వాయిదా వేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని అంతలోతుగా పరిశీలించలేదని ఆయన తెలిపారు. ఎంపీల వినతిమేరకే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు త్వరలో లేఖలు రాస్తామని, ఎంతమంది ప్రతినిధులను పంపుకోవాలో ఆయా పార్టీల ఇష్టమని అన్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని సీమాంధ్ర పార్టీల చేతిని వారి తలపైనే పెట్టించే యత్నం చేశారు. కేంద్ర హోం మంత్రి ప్రకటనతో సీమాంధ్ర పార్టీలన్నీ నైరాశ్యంలో కూరుకుపోయాయి. తమందరి తరఫున ప్రతినిధిగా వెళ్లిన ముఖ్యమంత్రిని అధిష్టానం పెద్దలు ఏమాత్రం ఖాతరు చేయకపోవడం వారిని కుంగదీసింది. ఇప్పటికి అఖిలపక్షం వాయిదా పడితే గండం గడిసేదని, తర్వాత సంగతి ఏదోలా చూసుకుందమనుకున్న వారికి ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం, ప్రధానప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ అధినేత తెలంగాణపై అఖిలపక్షాన్ని వాయిదా వేయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సమావేశంలో ఎలాంటి స్టాండ్‌ చెప్పాలో తెలియక మల్లగుళ్లాలు పడుతున్నారు. ఇంతకాలం తాము తెలంగాణకు వ్యతిరేకం కదాని చెప్తూ వచ్చిన పార్టీలు ఇప్పుడు ఏదో ఒక అభిప్రాయం చెప్పక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ తరఫున అఖిలపక్షానికి ఒకే పార్టీ హాజరవుతాడని ప్రకటించినా అది అంత నమ్మశక్యంగా లేదు. కేంద్రం అఖిలపక్షంపై వెనక్కి తగ్గకపోవడం సీమాంధ్ర పార్టీలకు మింగుడుపడకుండా ఉంది.